Harish Rao Fires On Agriculture Officers: పంటల సాగు వివరాలు తెలియని వ్యవసాయాధికారులు ఇక రైతులకు ఏం సేవ చేస్తారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా మొగుడంపల్లి మండలం మన్నాపూర్ రైతు వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొగుడంపల్లి మండలానికి సంబంధించి పంటల సాగు వివరాలు చెప్పాలని అధికారులను ఆయన ప్రశ్నించారు. మంత్రి ప్రశ్నలకు సమాధానం చెప్పటంలో జహీరాబాద్ ఏడీఏ బిక్షపతి, మన్నాపూర్ ఏఈవో తడబడ్డారు.
దీంతో అధికారుల తీరుపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఎంత మేర పంటలు సాగుచేస్తున్నారో తెలియకుండా అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాల పర్యటనకు వచ్చే ముందు అన్నిశాఖల వివరాలను తాను సమగ్రంగా తెలుసుకుంటానని తెలిపారు. మంత్రి వస్తున్నాడని తెలిసినా.. అధికారులకు సమాచారం తెలియకపోవటం సరికాదన్నారు. వ్యవసాయ అధికారుల తీరును ప్రత్యేకంగా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ శరత్‌ను ఆదేశించారు. అంతకుముందు జహీరాబాద్‌లో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఎంపీ బీబీ పాటిల్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.
"చెరుకు పంట వివరాలు అడిగాను. మీ మండలంలో చెరుకు సాగు ఎంత అని అడిగాను. జిల్లాలో ఏ పంట ఎంత సాగు అవుతుందో తెలియకపోతే ఏడీఎ, ఏఈవో ఏం పని చేస్తున్నారు. పంటల సాగు వివరాలు తెలియని మీరు ఇక రైతులకు ఏం సేవ చేస్తారు." - హరీశ్‌రావు, మంత్రి
ఇవీ చదవండి: ఇబ్రహీంపట్నం కు.ని. ఘటన.. 13 మందిపై ప్రభుత్వం చర్యలు..
'భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు కుట్ర'.. 'PFIని బ్యాన్ చేయండి'