నకిలీ విత్తనాలతో నరకప్రాయంగా మారిన రైతుల బతుకులు - నకిలీ విత్తనాలతో నరకప్రాయంగా మారిన రైతుల బతుకులు
సంగారెడ్డి జిల్లాలో పత్తి రైతులు నకిలీ విత్తనాలతో చిత్తు అవుతున్నారు. ఇప్పటికే కొందరు రైతులు రెండు సార్లు పత్తి ఏరి అమ్మకాలు జరుపుతుంటే... నకిలీ విత్తనాలు వాడిని అన్నదాతలు మాత్రం తమ చేనులో పూత, కాత ఎప్పుడుస్తుందా అని అమాయకంగా వేచి చూస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో అధిక విస్తీర్ణంలో పత్తి సాగవుతోంది. చాలా మంది రైతులు తెల్ల బంగారాన్ని ఏరి... దానిని జిన్నింగ్ మిల్లులకు, సీసీఐ కేంద్రాలకు తరలించి అమ్ముకొని సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. కానీ మరికొంత మంది రైతుల పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. దాదాపు పంట కాలం ముగిసే దశకు వచ్చినా... ఇంకా వాళ్ల చేలల్లో పత్తికి కాయ రాలేదు, పూత లేదు. ఇంకెప్పుడు దూది పూలు పూస్తాయా అని రైతులు కళ్లల్లో వత్తులేసుకొని చూస్తున్నారు.
పంట కాలం ముగుస్తున్నా... పూత రాలేదు
సదాశివపేట, కొండాపూర్, న్యాల్కల్ మండలాల్లో నకిలీ విత్తనాల సమస్య ఎక్కువగా ఉంది. మూడు రకాల విత్తనాల్లోనే ఈ సమస్య ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా ఒక పత్తి మొక్కకు 60 వరకు కాయలు రావాలి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. కొన్ని చోట్ల 20కి లోపు మాత్రమే కాయలు వచ్చాయి. అవి కూడా పురుగు పట్టిపోతున్నాయి. మరి కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే పువ్వులు వస్తున్నా.. రాలిపోతున్నాయి. ఇతర కంపెనీలకు చెందిన విత్తనాలు నాటిన పక్క పొలాల్లో మాత్రం మంచి దిగుబడి వచ్చింది.
ఎకరాకు 40 వేల పెట్టుబడి
భూమి కౌలుకు తీసుకొని పత్తి సాగు చేసిన రైతుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. పెట్టుబడి కోసం చేసిన అప్పుల ఓ వైపు, కౌలు భూమి ధర మరోవైపు... వీటిని ఎలా కట్టాలో తెలీక వేసిన పంటను చూస్తూ తల్లడిల్లిపోతున్నారా రైతులు. రోజులు గడుస్తున్నా కాత, పూత రాకపోవడం వల్ల రైతులు మరిన్ని మందులు పిచికారీ చేస్తూ మరింత అప్పుల్లో కూరుకుపోయారు. దాదాపు ఒక్కో ఎకరాకు అన్ని రకాలుగా 40 వేల వరకూ పెట్టుబడి పెట్టారు. ఆరుగాలం కష్టపడి పనిచేశారు. అయినా ఒక్క పత్తి పువ్వు కూడా పూయలేదు. లాభాలొస్తాయని ఆశించిన అన్నదాతలు లక్షల రూపాయల అప్పుల్లో కూరుకుపోయి ఆగమైతున్నరు.
ఇప్పటికైనా న్యాయం చేయండి సారూ...
వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు క్షేత్ర స్థాయిలో పర్యటించి.. విత్తన లోపాల నిగ్గు తేల్చి తమకు న్యాయం చేస్తారనే ఆశతో... 150 మందికి పైగా రైతులు నకిలీ విత్తనాలపై వ్యవసాయ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వారు స్పందించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసి కర్షకులతో చెలగాటం అడుతున్న విత్తన కంపెనీల నుంచి పరిహారం ఇప్పించడంతో పాటు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇవీ చూడండి: 28 కార్పొరేషన్లను లాభదాయక పదవుల నుంచి మినహాయిస్తూ ఆర్డినెన్స్ జారీ