భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకగుర్తింపు ఉంది. కాల క్రమేణ ...నేటి తరం మనదైన జీవనశైలికి దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో... మన ఆచార వ్యవహారాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గీతం విశ్వవిద్యాలయం ఏటా ఓ రోజు కేటాయిస్తుంది. "ఎత్నిక్ డే"- (ETHNIC DAY) పేరుతో... వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా బుధవారం... గీతం రుద్రారం క్యాంపస్‌లో ఎత్నిక్ డే కన్నుల పండుగగా జరిగింది. అబ్బాయిలంతా పంచెకట్టు, కుర్తాలతో సందడి చేశారు. అమ్మాయిలు పట్టుచీర, లంగావోణిలతో క్యాంపస్‌కు పండగశోభ తీసుకువచ్చారు. కళలకు ఆది దేవుడైన నటరాజ స్వామి పూజతో కార్యక్రమం ప్రారంభించారు. విద్యార్థులే స్వయంగా పాయసం తయారు చేసి.. దేవుడికి సమర్పించారు. అలాగే, సంప్రదాయ వంటలు తయారుచేయడంలోనూ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
సంప్రదాయ వేషాధరణతో: క్యాంపస్‌లోని విశాలమైన రోడ్లపై ముగ్గుల పోటీలు నిర్వహించారు. విభిన్నమైన థీమ్స్‌తో అమ్మాయిలంతా ఒక్కో బృందంగా ఏర్పడి ముగ్గులు వేశారు. కొందరు అబ్బాయిలు ఆసక్తితో వారు కూడా ముగ్గులు వేయడంలో తమవంతు సహకారం అందించారు. అమ్మమ్మ, నానమ్మల ఇళ్లకు వెళ్లినప్పుడు మాత్రమే ముగ్గులు వేస్తుంటాం. కళాశాలలోనూ స్నేహితులతో కలిసి వేయడం సంతోషంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. మ్యూజిక్ తంబోలా విద్యార్థుల్ని విశేషంగా అలరించింది. ఎత్నిక్ డేలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.. ర్యాంప్ వాక్. సంప్రదాయ వేషాధరణతో విద్యార్థులంతా ఇందులో పాల్గొన్నారు.
విదేశీ విద్యార్థుల సందడి: ఈ క్యాంపస్‌లో చదువుతున్న విదేశీ విద్యార్థులూ ఎత్నిక్ డేలో పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ముగ్గులు వేయడం, పంచెకట్టు వంటి వాటికి వారు ముగ్దులయ్యారు. కరోనా కారణంగా రెండేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. విద్యార్థులంతా ఆన్‌లైన్ తరగతులకే పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో... "ఎత్నిక్ డే" విద్యార్థుల్లో నూతనోత్సాహన్ని నింపింది.
'మాది ఆఫ్రికా, ఇక్కడున్న వారంతా భారతీయులు. విభిన్న సంస్కృతి, సంప్రదాయాల నుంచి మేము ఎంతో నేర్చుకున్నాం. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉంది. విభిన్నమైన సంప్రదాయాల కలయిక గల ఈ కార్యక్రమం ఎంతో నేర్పించింది. ఈ అనుభూతి జీవితాంతం గుర్తుంటుంది. గీతం క్యాంపస్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమం చూస్తుంటే మా సొంత దేశంలో ఉన్న అనుభూతి కలుగుతోంది. ప్రతి ఒక్కరూ తమ సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేయడం కన్నుల విందుగా ఉంది.'
- విదేశీ విద్యార్థులు
ఈ కార్యక్రమం నిర్వహణ బాధ్యతలన్నీ విద్యార్థులే చూసుకున్నారు. ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేసి... నిధులు సమీకరించారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వంటలు రుచి చూడటానికి అందరు ఆసక్తి కనబర్చారు. విశ్వవిద్యాలయాల్లోనే కాదు... సాధారణ కళాశాలల్లోనూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని విద్యార్థులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి:Irani chai: నేటి నుంచి ‘ఇరానీ చాయ్’ ధర రూ.5 పెంపు..