ఆలయ నిర్మాణానికి అడ్డుగా ఉందని కొట్టిపడేసిన ఓ భారీ రావిచెట్టు పర్యావరణ ప్రియుడైన ఓ యువకుడి చేతుల్లో మళ్లీ ఊపిరి పోసుకుంది. నేడు కొత్త చిగుళ్లతో కళకళలాడుతోంది. సంగారెడ్డి జిల్లా ముక్తాపూర్‌కి చెందిన పాలడుగు జ్ఞానేశ్వర్(23) ఎనిమిదేళ్లుగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. ఆయన ఉన్నాడని తెలిస్తే చుట్టుపక్కల ఊళ్లలో అనవసరంగా ఏ చెట్టూ కొట్టరు. అలాంటిది మూడు నెలల క్రితం ఆ యువకుడు లేని సమయం చూసి సొంతూళ్లోనే ఓ రావిచెట్టును కొట్టేశారు.
- ఇదీ చదవండి : ఈ ప్రకృతి అందాలను చూస్తే.. మనసంతా పులకరింతే!
విషయం తెలుసుకున్న జ్ఞానేశ్వర్ విలవిల్లాడారు. దానికి ఎలాగైనా ప్రాణం పోయాలని తపించారు. ఎరువు, మట్టి తెచ్చి కొందరు స్థానికుల సహకారంతో మళ్లీ దానిని గ్రామంలో వేరేచోట నాటించారు. నిత్యం నీళ్లు పోస్తూ సంరక్షించారు. ఫలితంగా కుదురుకున్న ఆ రావిచెట్టు నేడు కొత్త చిగుళ్లు తొడుగుతోంది. తన శ్రమ ఫలించడంతో జ్ఞానేశ్వర్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పదో తరగతి చదివేటప్పటి నుంచే...
జ్ఞానేశ్వర్ తల్లిదండ్రులు రెండెకరాలు సాగు చేస్తుండేవారు. ఆ ప్రాంతంలో భూగర్భజలాలు తక్కువ. ఎండాకాలంలో తాగునీటికీ కటకట. చెట్లను కొట్టేస్తుండటం, వర్షాభావంతో మంజీరా నది వెలవెలబోతుండటంతో ఈ యువకుడి అడుగులు పర్యావరణ పరిరక్షణ దిశగా కదిలాయి. పదోతరగతిలో ఉండగానే గ్రామ చిన్నారులతో కలిసి మొక్కలు పెంపకం, పర్యావరణ పరిరక్షణపై చైతన్యం పెంచే ప్రయత్నం చేశారు. విత్తన బంతులు తయారీ చేసి.. ఏటా మంజీరా తీరం వెంట చల్లుతున్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని, మొక్కలు నాటాలని కోరుతూ ఇటీవల సిద్దిపేట నుంచి నారాయణఖేడ్ వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. పర్యావరణంపై వీడియోలను య్యూటూబ్‌లో పెడుతుంటారు. జ్ఞానేశ్వర్, ఆయన బృందాన్ని సంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు హరితహారంలో భాగస్వాములను చేశారు. జ్ఞానేశ్వర్‌ను మనూరు జిల్లా ప్రజాపరిషత్తు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సోమవారం సత్కరించారు.