Drunk man hulchul: కొందరికి మందు తాగటం ఆనందమేతే.. ఇంకొందరికి అలవాటు.. మరికొందరికి వ్యసనం. తాగటం అనే ప్రక్రియ ఎవరికైనా వ్యక్తిగతమే.. కానీ ఆ తర్వాత కొందరు చేసే చర్యలే ఊహాతీతం. పీకలదాకా తాగి.. సోయి లేకుండా ఇంట్లోనే పడుకోవటం.. రోడ్లపై ఎక్కడపడితే అక్కడే పడిపోవటం.. చేస్తుంటారు. వీటితో వచ్చే బాధేమీ లేదు. ఇంకో వర్గం మందుబాబులుంటారు. ఇంట్లో వాళ్లపై ప్రతాపం చూపించటం.. వీధుల్లో వీరంగం సృష్టించటం చేస్తుంటారు.
పూటుగా తాగాక.. ఒక్కొక్కరు ఒక్కో హీరో అయిపోతారు. ఒకడేమో.. కత్తి పట్టుకుని రోడ్డుపై వచ్చేపోయే వాహనాలు ఆపి బెదిరిస్తుంటాడు. ఇంకోకడేమో.. రోడ్డుపైన పొర్లు దండాలు పెడతాడు. ఇలా ఒక్కో మందుబాబు చేసే హల్చల్ ఒక్కో రేంజ్లో ఉంటుంది. అయితే.. ఈ మందు బాబు మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించాడు. ఏకంగా నాగుపామునే తోడుగా తెచ్చుకుని జనాలను ఆగం చేశాడు.
పీలదాకా సురాపానం.. మెడలో నాగుపాము..
Drunk man hulchul with snake: హాలాహలం గొంతులో దాచుకున్న శివుడిలా.. పీకలదాకా సురాపానం సేవించిన మన మందుబాబు కూడా మెడలో నాగుపాముతో రోడ్డు మీదకి వచ్చాడు. రోడ్డు మీద కనిపించిన వాళ్ల దగ్గరికి వెళ్లి పామును చూపిస్తూ.. డబ్బులు అడుగుతూ ఇబ్బంది పెట్టాడు. దుకాణాల్లోకి వెళ్లి డబ్బులు డిమాండ్ చేశాడు. ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు వెళ్లిన తాగుబోతు.. పైసలు అడగటమే కాకుండా... అందులో ఉన్న కస్టమర్లపైకి పామును ఉసిగొల్పుతూ భయపెట్టాడు. డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. ఎవరైనా మందలిస్తే.. వాళ్లపైకి పామును ఉసిగొల్పి భయపెట్టే ప్రయత్నం చేశాడు.
పామును కూడా ఇబ్బందిపెట్టిన మందుబాబు..
ఓ నాగుపాము కోరలు పీకేసి.. దాన్ని మెడలో వేసుకున్నాడు. మెడలో నుంచి జారిపోకుండా పాము తలను చేతితో గట్టిగా పట్టుకున్నాడు. జనాలను బయపెట్టాలన్నప్పుడల్లా పాము మెడను నొక్కుతున్నాడు. ఆ నొప్పిని తట్టుకోలేక.. పాము తన నోరు తెరుస్తూ.. ఇబ్బంది పడింది. దాన్ని చూసి జనాలు భయపడిపోయారు. తల ఆ వ్యక్తి చేతిలో ఉండటం వల్ల ఆ పాముకు పారిపోడానికి వేరేదారి లేక.. అతడు పెట్టిన టార్చర్‌ను భరించింది. ఇలా ఈ మందుబాబు.. అటు జనాలనే కాకుండా.. వాళ్లను భయపెట్టే క్రమంలో పామును కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు.
ఈ పోతగాని విన్యాసాలకు ఇబ్బందిపడిన స్థానికులు రామచంద్రాపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. తాగుబోతును అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. సదరు మందుబాబు.. స్థానికంగా ఉండే వ్యక్తేనని స్థానికులు తెలిపారు. అతడు తరచూ మద్యం సేవించేవాడని.. ఇలా పాముతో వీరంగం సృష్టించటం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: