ఇంట్లో కూర్చుని సీఎం కేసీఆర్ గాలి మాటలు చెప్పటం తప్పా అభివృద్ధి మాత్రం ఏమీ లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. పటాన్‌చెరు డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి జయమ్మకు మద్దతుగా జగ్గారెడ్డి ప్రచారం నిర్వహించారు. డివిజన్లో ప్రభుత్వాసుపత్రి, జాతీయ రహదారి, బాహ్యవలయ రహదారులు కాంగ్రెస్ హయాంలో నిర్మించినవే అని ఎమ్మెల్యే గుర్తుచేశారు. పటాన్‌చెరులో తమను ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదన్నారు.
ప్రతీ పేదవాని ఖాతాల్లో రూ .15 లక్షలు వేస్తానని చెప్పిన ప్రధాని మోదీ... 6 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా అందట్లేదని ఆరోపించారు. ఉప ఎన్నికలో, ఎన్నికలో వస్తే తప్ప తెరాస మంత్రులు కనపడరన్నారు. జిల్లా మంత్రి పటాన్‌చెరులో ఏం అభివృద్ధి చేసారో చెప్పాలని డిమాండ్ చేశారు. యువతను భాజాపా రెచ్చగొట్టి ఓటు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్కు పవర్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.