సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన అమృతమ్మ.. కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగింది. ఆమెను వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. కొద్ది సేపు వైద్యం అందించి అమృతమ్మ మరణించిందని అక్కడ అందుబాటులో ఉన్న సిద్ధార్ధ్ అనే వైద్యుడు చెప్పినట్లు బాధితులు తెలిపారు. పోలీసు ఫిర్యాదు పత్రం అడగ్గా కుటుంబసభ్యులు గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్లగా.. అమృతమ్మ మాట్లాడుతోంది అంటూ ఫోన్ చేశారు. వారు వెంటనే సమీప బాలాజీ ఆసుపత్రికి వెళ్లగా.. రూ. 50 వేలు వైద్యానికి అడిగారు.
గాంధీలో 36 గంటలు..
ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న కుటుంబసభ్యులు అమృతమ్మను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. దాదాపు 36 గంటల పోరాటం తర్వాత అమృతమ్మ మంగళవారం సాయంత్రం మరణించింది. అమృతమ్మ బతికుండగానే చనిపోయిందని చెప్పిన వైద్యుడిని వెంటనే విధుల నుంచి తొలగించాలని కుటుంబసభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టగా.. వారికి సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు.
నివేదిక ఇవ్వాలన్న కలెక్టర్
ఈ విషయంపై వైద్యుడు సిద్దార్ధ్‌ను వివరణ కోరగా.. తాను అలా చెప్పలేదని.. అమృతమ్మను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన కలెక్టర్ హనుమంతరావు దృష్టికి వెళ్లగా.. బాధితుల ఆరోపణల ప్రకారం ఆసుపత్రి ఆర్ఎంవో మధుకర్‌ను ఈ విషయంపై నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు.
ఇదీ చూడండి చైనాకు చెక్: లద్దాఖ్‌కు కొత్త రోడ్డు మార్గం