సంగారెడ్డి జిల్లా కంది మండలం కవలంపేట గ్రామానికి చెందిన తలారి రాజు, గౌరి దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కొడుకులు. రాజు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ... తనకున్న కొద్ది పాటి భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. తన పెద్ద కొడుకు శశాంక్‌కు కొన్నాళ్ల క్రితం జ్వరం వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్తే... టైఫాయిడ్ అని చెప్పి చికిత్స చేశారు. రెండ్రోజులకే బాబుకి మళ్లీ జ్వరమొచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా... అనుమానంతో మరిన్ని పరీక్షల కోసం రెయిన్ బో ఆసుపత్రికి పంపించారు.
పరీక్షల్లో వైద్యులు శశాంక్‌కు బ్లడ్ క్యాన్సర్ అని నిర్ధరించారు. వెంటనే చికిత్స చేయాలని సూచించారు. ఉన్న పొలం, ఇల్లు, బంగారం అమ్మి కీమో థెరపి చేయించారు. ఉన్నదంతా అమ్మి వైద్యం చేయించినా వ్యాధి తగ్గకపోగా... తీవ్రత మరింత పెరిగింది. బోన్ మ్యారో ట్రాన్స్ ఫ్లాంటేషన్ చేస్తే ఆ చిన్నారి సమస్య తీరుతుందని వైద్యులు సూచించారు. ఇందుకోసం చిన్నారి అక్క సంజన బోన్ మ్యారోను పరీక్షించడంతో.. ఇద్దరివి సరిపోయాయి. ప్లాంటేషన్ కోసం సుమారు 12లక్షల రూపాయల వరకుప ఖర్చు అవుతుందని ఆ తల్లిదండ్రులు వాపోయారు.
బాబుని బతికించుకునేందుకు వారి దగ్గర ఇప్పడు డబ్బులు లేవు. ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకుంటే 4 లక్షల రూపాయల సాయం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో మిలాఫ్ ఫౌండేషన్ లక్షన్నర రూపాయలు అందించింది. చిన్నారి పరిస్థితిని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకొని కొంత మంది సాయం అందించారు. బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్‌కు ఇంకా 7లక్షల రూపాయల వరకు అవసరమని చిన్నారి తల్లిదండ్రులు అంటున్నారు.
ఎవరైనా దాతలు స్పందించి ఆపన్న హస్తం అందిస్తే.. ఆ చిన్నారిని కాపాడుకోవచ్చు. ఇప్పుడా సాయం చేసే చేతుల కోసం ఆ చిన్నారి కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాడు.
ఇవీ చూడండి: హైకోర్టుకు నివేదించాల్సిన అంశాలపై సీఎం దిశానిర్దేశం