లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు తమ వంతు సహకారం అందించి ఉదారతను చాటుకున్నారు ఇద్దరు దివ్యాంగులు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఊరేళ్ల గ్రామానికి చెందిన దివ్యాంగా అక్కాచెల్లెళ్లు ఉబ్బటి ఎల్లమ్మ, ఉబ్బటి అనిత తమ పింఛను గ్రామపంచాయతీకి అందించి మానవత్వం చాటుకున్నారు. ప్రతి నెల ప్రభుత్వం ఇచ్చే పింఛను డబ్బులతో జీవనం సాగించే ఆ అక్కాచెలెళ్లు మంచి మనసుతో గ్రామ పంచాయతీకి ఒక నెల పింఛను రూ.3వేల చొప్పున మెుత్తం రూ.6వేలను గ్రామ సర్పంచ్ హంగీర్, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్కు అందజేశారు.
తాము ఇచ్చిన డబ్బులు ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఎంతో కొంత ఆసరాగా ఉండేవిధంగా చూడాలని సర్పంచ్, వైస్ ఎంపీపీలకు విన్నవించారు. పింఛను డబ్బులన్నీ పంచాయతీకి ఇచ్చారు కదా మరి... మీరెలా బతుకుతారు... ఏమి తింటారు అని వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, సర్పంచ్ జహంగీర్ అడుగగా... డబ్బులు మాకెందుకయ్యా.. కరోనా సమయంలో ఆ డబ్బులను మేము ఏ చేసుకుంటాము... డబ్బులు లేనివారికి ఖర్చు చేయండి... మేము ఉన్నవాటితోనే సరిపెట్టుకుంటామని చెప్పడంతో గ్రామస్థులు వారు చెప్పిన మాటలు విని వారిని అభినందించారు. సాయం చేయాలంటే డబ్బుతో సంబంధం లేదని, హృదయం ఉంటే చాలని ఆ దివ్యాంగులు నిరూపించారు.
ఇవీ చూడండి: వలస కష్టాలు.. తోపుడు బండిపై గర్భిణి