ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో వచ్చే ఏడాది రామానుజ సహస్రాబ్ది వేడుకలు నిర్వహిస్తున్నట్లు త్రిదండి చినజీయర్ స్వామి వెల్లడించారు. కొవిడ్‌ను అరికట్టడంలో ప్రభుత్వాల ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. కరోనా మహమ్మారి అంతమై ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. త్రిదండి చినజీయర్ స్వామివారి తిరు నక్షత్ర మహోత్సవంలో భాగంగా ప్రతి ఏటా ఆవార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. మహనీయులు ప్రపంచంలో అన్నిచోట్లా ఉంటారు... అటువంటి వారిని గుర్తించి సత్కరించటం మన ధర్మమన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో తిరునక్షత్ర మహోత్సవం, 29వ జీయర్ అవార్డు ప్రదానోత్సవం కార్యక్రమం నిర్వహించారు.
అందుకే ఫిబ్రవరి 2 వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 1,035 కుండ శ్రీ లక్ష్మీ నారాయణ మహాక్రతువు.... 108 దివ్యదేశ ప్రతిష్ట కుంభాభిషేకం నిర్వహించడంతో పాటు.. స్వర్ణమయ శ్రీ రామానుజ ప్రతిష్ట చేయనున్నామని తెలిపారు. వేదాలను చదివిన వ్యక్తి ప్రభావం ఆ ప్రాంతమంతా విస్తరించి ఉంటుందని... దీంతో ఆ పరిసరాలు పునీతం అవుతాయని త్రిదండి చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. అందుకే ప్రతి దీపావళికి వేదాల్లో కృషి చేసిన వారిని, వేదాల్లో అనుభవం గడించిన వారిని జీయర్ అవార్డ్ పేరిట సన్మానించుకుంటున్నామని తెలిపారు. 1994 నుంచి జీయర్ పురస్కారాలు ప్రదానం చేస్తున్నట్లు తెలిపిన ఆయన.. ఈ ఏడాది దిల్లీ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ గోపాల ప్రసాద శర్మకు అందించారు.
ప్రధాని చేతుల మీదుగా విగ్రహావిష్కరణ
2022 ఫిబ్రవరి 5న ప్రధాని(pm modi) చేతుల మీదుగా రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ చేయనున్నట్లు త్రిదండి చినజీయర్‌స్వామి ఇదివరకే ప్రకటించారు. ఫిబ్రవరి 2-14 వరకు సమతామూర్తి కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. ఫిబ్రవరి 14న పూర్ణాహుతిలో రాష్ట్రపతి (president) పాల్గొంటారన్నారు.
రామానుజాచార్యులు సమ సమాజ స్థాపనకు పూనుకున్నారని చినజీయర్ స్వామి అన్నారు. శ్రీరామానుజాచార్యులకు వెయ్యేళ్లు పూర్తయ్యాయని... సమతా సిద్ధాంతాన్ని రామానుజులు లోకానికి చాటారని చినజీయర్ స్వామి పేర్కొన్నారు. రూ. 1200 కోట్లకుపైగా వ్యయంతో ప్రపంచంలో రెండో అతిపెద్ద పంచ లోహ విగ్రహం నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. 120 కిలోల బంగారంతో నిత్యారాధాన విగ్రహం ఏర్పాటు చేస్తామని.. 12 రోజులు రోజుకు కోటిసార్లు నారాయణ మంత్రం పఠనం ఉంటుదన్నారు. కార్యక్రమంలో 5వేల మంది రుత్వికులు పాల్గొంటారని... 128 యాగశాలల్లో హోమం చేస్తామన్నారు. 1017లో రామానుజాచార్యులు అవతరించి 121 ఏళ్లపాటు భూమిపై ఉన్నారని త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు.
ప్రముఖుల హాజరు
శ్రీ రామానుజ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు త్రిదండి చినజీయర్ స్వామి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వేదాల్లో కృషి చేసిన వారిని అవార్డులతో సత్కరిస్తామని తెలిపారు. సమాజ శ్రేయస్సే లక్ష్యంగా రామానుజ సహస్రాబ్ది వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: