జగదభి రాముని కల్యాణం రాష్ట్రవ్యాప్తంగా కన్నుల పండువగా జరిగింది. వాడవాడలా చలువ పందిళ్లు, ముత్యాల తలంబ్రాలు, రఘురాముని కీర్తనలతో భక్తులు భక్తి పారవశ్యంలో ఓలలాడుతున్నారు. సీతారాముల వారి కల్యాణాన్ని ప్రజలంతా ఎంతో భక్తి శ్రద్ధల మధ్య జరుపుకుంటున్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని వనస్థలిపురంలోని లక్ష్మీ గణపతి దేవాలయం సీతారాముల వారి కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది.
వనస్థలిపురం గణేశ్ టెంపుల్లో: వనస్థలిపురంలోని లక్ష్మీ గణపతి దేవాలయం వద్ద శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. భక్తుల స్వహస్తాలతో స్వామివారి కల్యాణం జరిపించేందుకు అవకాశం కల్పించారు. 108 విగ్రహాలతో 108 జంటలు స్వామివారి కల్యాణంలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను చేశారు. భక్తులు శ్రీ సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు వీలుగా రెండు స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల జయజయ ధ్వానాల మధ్య జానకీ రాముల కల్యాణం కమనీయంగా సాగింది.
చిత్ర లేఔట్లో: మరోవైపు ఎల్బీనగర్ చిత్ర లే ఔట్ కాలనీలో కన్నులపండుగగా శ్రీ సీతా రాముల కళ్యాణ వేడుక జరిగింది. చిత్ర లే ఔట్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు భారీ ఏర్పాట్లు చేశారు. కమిటీ సభ్యులు, కాలనీవాసులంతా కలిసి కోదండ రాముడు, జానకీదేవి రి కల్యాణాన్ని ఎంతో వైభవంగా జరిపించారు. కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నగేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీరాముని కళ్యాణ మహోత్సవ పండుగను ఘనంగా నిర్వహించుకుంటామని, సీతా రాముల స్వామి వారిని స్ఫూర్తిగా తీసుకొని జీవనం సాగిస్తున్నామని అన్నారు. కుల మతాలకు అతీతంగా శ్రీ రామనవమి ప్రతి సంవత్సరం ఘనంగా కుటుంబ సమేతంగా ఒక పండగ వాతావరణంలో నిర్వహించుకుంటామని అన్నారు. స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో చిత్రాలేఔట్ సంక్షేమ కమిటీ సభ్యులతో పాటు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్యాణం అనంతరం భోజనం ఏర్పాటు చేశారు.
"ఇక్కడ ప్రజలందరం కలిసి శ్రీరామనవమిని ఘనంగా జరుపుకుంటున్నాము. ఏవైతే పండుగలు మన సంస్కృతిని నేర్పిస్తాయో తూచ తప్పకుండా మా కాలనీ ప్రజలంతా పాటిస్తూ.. శ్రీరాముడి జీవనాన్ని ఆదర్శప్రాయంగా తీసుకుని అదే స్ఫూర్తిగా ముందుకు సాగుతున్నాము. కష్టంలో కూడా, నష్టంలో కూడా, సంతోషంలో కూడా ఎలా ఉండాలో చెప్పేదే రామాయణం."_నాగేష్, చిత్ర లేఅవుట్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు
ఇవీ చదవండి: