వర్షాకాలం వచ్చిందంటే చాలు దారిపొడవునా పరుచుకునే పచ్చదనం, పక్షుల కిలకిలరావాలు, పచ్చని పంట పొలాలు, అబ్బురపరిచే జల సోయగాలు ఉంటాయి. అదే కోవలో గుట్టల మధ్య ప్రకృతి అందాలు, రమణీయతకు చిరునామాగా బోడకొండ జలపాతం నిలుస్తోంది. హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బోడకొండ వద్ద ఇది ఉంది. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలకు జలపాతం కళకళలాడుతోంది. దీన్ని చూసేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు తరలివస్తున్నారు. జంట నగరవాసులే కాకుండా రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, వరంగల్ తదితర జిల్లాల నుంచి కార్లు, ద్విచక్ర వాహనాల్లో ఇక్కడి వస్తున్నారు.
జలకాలాడుతున్నారు
సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన కుటుంబాలు జలపాతాన్ని చూసి ఉత్సాహంగా గడుపుతున్నాయి. యువత ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. రెండున్న కిలోమీటర్ల పొడవున్న జల సవ్వడుల మధ్య ఎక్కడపడితే అక్కడ రాతి చాపలపై.. నీటిలో దిగి ఈత కొడుతున్నారు. మరికొందరు జాలువారుతున్న పరవళ్లల్లో జలకాలాడారు. కొందరు పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటున్నారు. మరికొందరు ఫొటోలు తీసుకుని సరదాగా గడుపుతున్నారు.
చెక్‌డ్యామ్ కట్టాలి
ఎప్పుట్నుంచో జలపాతం ఉన్నా.. పెద్దగా ఎవరికీ తెలియదు. గతేడాది కురిసిన వర్షాలకు వెలుగులోకి వచ్చింది. భారీ వర్షాలు, వరదలకు ఎగువన చెన్నారెడ్డిగూడ ప్రాంతం కొండ కోనల్లో నుంచి ఈ జలపాతం వస్తోంది. ఈ నీరంతా వృథాగా దిగువకు వెళ్లిపోతోంది. నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే... దిగువన ఒక చెక్‌డ్యామ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
మౌలిక సదుపాయాలు కల్పించండి
జలపాతానికి వెళ్లేందుకు బోడకొండ గ్రామ పంచాయతీ వరకు రోడ్డు సదుపాయం ఉంది. సందర్శకుల రాక దృష్ట్యా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నేల చదును చేసి కార్లు, ద్విచక్ర వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. వంటశాలలు, చిరుదుకాణాలూ వెలుస్తున్నాయి. జలపాతం వరకు రోడ్డువేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: 'అమూల్ బేబీ' ఎలా పుట్టిందో తెలుసా?