మూసీనది కాలుష్యాన్ని నివారించి పర్యావరణహితంగా పునర్జీవింపజేసేందుకు ప్రణాళికబద్ధంగా పనులు కొనసాగించాలని ఎన్‌జీటీ నియమించిన మానిటరింగ్ కమిటీ ఛైర్మన్ జస్టిస్ విలాస్ వీ అఫ్జల్ పుర్కర్ అధికారులకు సూచించారు. రంగారెడ్డి కలెక్టరేట్‌లో హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మూసీ పునరుజ్జీవనానికి వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనుల పురోగతిని ఛైర్మన్ సమీక్షించారు.
మూసీ ప్రవహిస్తున్న ప్రధాన ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఈ కమిటీకి మెంబర్ కన్వీనర్‌గా వ్యవహారిస్తున్న జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్ సీవై నగేశ్ సమీక్షలో తెలిపారు. మొదటి దశ కింద బాపూ ఘాట్ నుంచి నాగోల్ వరకు దాదాపు 20 కిలోమీటర్ల పొడవునా మూసీలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని, గుర్రపుడెక్కను పూడిక యంత్రాల ద్వారా తొలగించినట్లు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చీఫ్ ఇంజినీర్ మోహన్ నాయక్ వివరించారు.
రెండవ దశలో మిగిలిన 35 కిలోమీటర్ల పొడవును చేపట్టిన పూడిక తీత పనులు ఫిబ్రవరి నాటికి పూర్తవుతాయని స్పష్టం చేశారు. నాలాల ద్వారా వస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడానికి 10 చోట్ల ట్రాష్ బారియర్స్‌ను ఏర్పాటు చేయుటకు టెండర్లను పిలిచినట్లు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మూసీ హద్దులను గుర్తించినట్లు వివరించారు. మూసీ ఆక్రమణలను అరికట్టడం కోసం 60 మంది భద్రతా సిబ్బందితో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవీచూడండి: వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం