రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో నిరాహార దీక్ష చేస్తున్న భాజపా నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిని నిర్మిస్తామని మూడేళ్ల క్రితం మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ భాజపా నాయకులు ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. దీక్ష శిబిరంపై దాడి చేసిన పోలీసులు భాజపా కార్యకర్తలను పీఎస్కు తరలించారు.
నిరుపేదలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా నిరాహార దీక్ష చేపట్టామని భాజపా నాయకులు పేర్కొన్నారు. పోలీసులతో దీక్షను భగ్నం చేయడం వల్ల పలువురికి గాయాలయ్యాయని వారు ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే గొంతులను తెరాస ప్రభుత్వం పోలీసులతో కట్టడి చేస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని విమర్శించారు. చిత్తశుద్ధి లేని ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారని భాజపా నాయకులు ధీమా వ్యక్తం చేశారు.