కరోనా కష్ట కాలంలో ఎంతో శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు, పోలీసుల సేవలను కొనియాడుతూ... సమాజమంతా మద్ధతుగా నిలుస్తోంది. ఇదంతా ఒకెత్తు అయితే... ఎండనకా... వాననకా చెమటోరుస్తున్న పోలీసుల కష్టాన్ని చూసి చలించిపోయింది సిరిసిల్లకు చెందిన మైసవ్వ అనే అవ్వ.
పట్టణంలోని మీ-సేవలో కూలీ పని చేసుకునే మైసవ్వ... గాంధీనగర్లో ఓ చిన్న రేకులషెడ్డులో నివాసముంటోంది. ఓ కొడుకు, ఓ కూతురు ఉన్న మైసవ్వ భర్త చనిపోయాడు. రెండు నెలలుగా ఎండలో ఎంతో కష్టపడుతున్న పోలీసులను చూసి చలించిపోయింది. తనకు తోచినంతలో సాయం చేయాలనుకుంది. 3 స్ప్రైట్, 3 ఫ్రూటీ బాటిళ్లు తీసుకొచ్చి విధులు నిర్వహిస్తున్న పోలీసులకు గ్లాసుల్లో పోసిచ్చింది.
"అయ్యా... మా కోసం మీరు ఎంతో కట్టపడతున్నారు. రాత్రింబవళ్లు శ్రమిస్తూ... మమ్మల్ని కాచుకుంటుండ్రు. ఈ చల్లని కూల్డ్రింకులు తాగి జల సల్లపడుండ్రి" అంటూ... తన మనసులోని వెచ్చని మాటలతో పాటు చల్లని పానియాలను అందించింది మైసవ్వ
మైసవ్వ ఔదర్యానికి స్పందించిన పోలీసులు... "అమ్మా మా కష్టాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు. నీ లాంటి తల్లి ఆశీర్వాదం ఉన్నన్ని రోజులు... ఎంత కష్టాన్నైనా మీకోసం చేస్తాం" అని అవ్వ ఇచ్చిన కూల్డ్రింక్ తీసుకుని అవ్వను సంతోషపరిచారు.