Handloom workers Strike: అయిదేళ్లుగా పెరగని కూలీరేట్లు, మూడేళ్లుగా రాయితీలు లభించని పరిస్థితులు.. వెరసి సిరిసిల్లలో పాలిస్టర్, బతుకమ్మ చీరల ఉత్పత్తి నిలిచిపోయింది. కూలీరేట్లకు తోడు నూలు, డాబీలు, పింజర్ల రాయితీ మంజూరు కాకపోవటం.. వాటి పరంగా అధికారులు, యాజమాన్యాల నుంచి స్పందన లేకపోవడంతో కార్మికులు సమ్మె బాట పట్టారు. ఆసాములు, కార్మికులకే పరిమితమైన సమ్మె క్రమంగా పలు కార్మిక సంఘాల మద్దతుతో అనుబంధ రంగాలకూ విస్తరించింది. నాలుగోరోజు సిరిసిల్లలో మరమగ్గాల కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.
చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. సిరిసిల్లలో మరమగ్గాల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న దీక్షలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కార్మికులతో కేవలం 10 నిమిషాలు మాట్లాడేందుకు సమయం కేటాయించని కేటీఆర్.. తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. మంత్రిగా ఉండి కూడా ఇక్కడ నేత కార్మికులు, ఆసాములు సమ్మె చేస్తుంటే పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో సమస్యల గురించి పట్టించుకోవాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి.. ఒప్పందం ప్రకారం పెంచిన కూలీ విధానాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కార్మికులను ఆదుకోండి..
దినమంతా కష్టపడితే చేనేత కార్మికులకు వచ్చేది 300 రూపాయలు. అంటే నెలకు 9వేల రూపాయలు. మరి ఈ 9వేల రూపాయలతో కుటుంబం ఎట్ల గడుస్తది. నీ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దలేనోడివి దేశాలు పట్టుకుని తిరుగుతుండు నా మిత్రుడు. కార్మికులతో కేవలం 10 నిమిషాలు మాట్లాడేందుకు సమయం కేటాయించని కేటీఆర్.. తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదం. బయట నుంచి వచ్చేవారికి ప్రోత్సాహం ఇవ్వడం కాదు.. ముందు ఇక్కడ కష్టాలు పడుతున్న కార్మికులను ఆదుకోండి. -జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ
ఇదీ చదవండి: