ఎంతో కసరత్తు చేసి దశాబ్ధాలుగా అపరిష్కృతంగా ఉన్న రంగంపేట అటవీ భూ సమస్యలకు పరిష్కారం చూపామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటలో భూమి పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పోడు భూములను ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 307 మంది ఎస్టీలు, ఇతర పేదలకు 281 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులు కల్పించినట్టు తెలిపారు. ప్రజలకు పాలనను మరింత దగ్గర చేసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయితీలు ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా ఏర్పడిన వీర్నపల్లి మండలంతో ప్రజలకు ఆర్థిక భారంతోపాటు దూరం తగ్గిందన్నారు.
చెట్లు నరికితే ఊరుకోం..
రైతును రాజుగా చూడాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో... ఇంత కష్టకాలంలోనూ 57 లక్షల మందికి రైతుబంధు ఇచ్చామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అందుకోసమే పెట్టుబడి సాయం, ఉచిత విద్యుత్, రైతుబీమాతోపాటు వ్యవసాయాన్ని లాభాసాటిగా మార్చేందుకు నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. అడవిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని... చెట్లను నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొక్కలు నాటడమే కాదు... సంరక్షించాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలన్నారు.
రహదారులతోనే అభివృద్ధి
రోడ్లు బాగుంటేనే ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది... అందుకే రూ.15 కోట్లతో బ్రిడ్జి, రోడ్లు నిర్మించినట్టు కేటీఆర్ తెలిపారు. వీర్నపల్లిని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాన్నారు. గ్రామీణ రహదారులు, వంతెనల విషయంలో గత ఆరేళ్లలో గణనీయమైన పురోగతి సాధించినట్టు తెలిపారు. రాజకీయ లాభాపేక్ష లేకుండా భవిష్యత్ తరాల బాగుండాలనే... కేసీఆర్ తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో తాగునీరు కొనుక్కుంటారు అని రాస్తే... అందురూ నవ్వారని కానీ ఇప్పుడు వాస్తవరూపం దాల్చిందన్నారు.
ఇదీ చూడండి: కూల్చివేత వేగవంతం... జూన్ 2 వరకు కొత్త సచివాలయం