KTR Comments: రాష్ట్రంలో అమలు చేసే పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. అందుకు కారణం.. సీఎం కేసీఆర్‌కు తనపై ఆత్మవిశ్వాసంతో పాటు ప్రజలపై నమ్మకమేనని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం బండలింగంపల్లిలో "మన ఊరు మన బడి" కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ.28 లక్షలతో నిర్మించనున్న ఆధునిక భవన నిర్మాణం, నూతన మౌలిక సదుపాయాల కల్పన పనులకు శంకుస్థాపన చేశారు. మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా మూడేళ్లలో 7 వేల 3 వందల కోట్లతో 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్టు మంత్రి తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నైతే అన్ని అదనపు తరగతి గదులను నిర్మిస్తామన్నారు. తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా డిజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేస్తామన్నారు.
"భవిష్యత్ తరానికీ బంగారు బాటలు వేసేదే బడి. రాష్ట్రంలో 973 గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి.. 5 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నాం. ఒక్కో విద్యార్థిపై లక్షా 25 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు డా. బీఆర్ అంబేడ్కర్, మహాత్మా జ్యోతి రావు పూలే పేరున ఓవర్సీస్ నిధి ఏర్పాటు చేశాం. 16 వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ క్రింద చెల్లించాం. కేసిఆర్ ఏది చెప్పినా మొదట అవుతుందా అంటారు.. ఆ తర్వాత వారెవా అంటారు. కేసీఆర్‌కు తనపై ఆత్మ విశ్వాసం, ప్రజలపై నమ్మకం ఉంది. కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. కేసీఆర్ లేకపోతే.. తెలంగాణ స్వరాష్ట్ర కాంక్ష సాకారం అయ్యేదా..? తెలంగాణ పల్లెల్లో జరిగిన అభివృద్ధిని.. దేశంలోని 6 లక్షల పల్లెల్లో ఎక్కడైనా చూపిస్తారా..? అడ్డదిడ్డమైన మాటలు కాదు భాజపా నాయకులకు దమ్ముంటే.. అభివృద్ధిలో పోటీ పడాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ నియోజకవర్గం వెయ్యి కోట్ల ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావాలి." - కేటీఆర్, మంత్రి
ఇవీ చూడండి:
- ఆమె కోసమే నేపాల్‌కు రాహుల్.. అందుకే ఇన్ని వివాదాలు!
- యాదాద్రి భక్తులకు ఊరట.. పార్కింగ్ అదనపు రుసుము ఎత్తివేత