రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో ఐదు రోజులుగా రెండు పిల్లలతో చిరుత సంచారం చేస్తోంది. వల్లంపట్ల, తాళ్లపల్లితో పాటు పలు గ్రామాల్లో చిరుత ఆనవాళ్లను అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇటీవల వల్లంపట్లలో అధికారులు సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. సమీప గ్రామాల్లో ఒకే చిరుత సంచరిస్తోందని అనుమానాలు ఉత్పన్నమయ్యాయి. తాజాగా... పొలాల్లో పిల్లలతో చిరుత తిరగడం గ్రామస్థుల కంట పడింది. చిరుత సంచారం నిజమేనని తేలటం వల్ల స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
ఇప్పటికే రెండు దూడలపై దాడి చేసి హతమార్చిన చిరుత... ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందోనని వణికిపోతున్నారు. సాయంత్రం సమయంలోనే.. గ్రామ సమీపంలో చిరుత తిరగడం వల్ల ప్రజల్లో మరింత ఆందోళన మొదలైంది. యాసంగి సాగులో రైతులు రాత్రి, పగలనక అనునిత్యం వ్యవసాయ క్షేత్రాల్లోనే సమయాన్ని కేటాయిస్తున్న దృష్ట్యా... ఎప్పుడు ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటే తప్ప.. చిరుత నుంచి తప్పించుకునే పరిస్థితులు లేవని స్థానికులు చెబుతున్నారు.