రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. పాఠశాల అంటెండర్ తరచూ మద్యం తాగి విధులకు హజరవ్వడంతో విద్యార్థులు భయబ్రాంతులకు గురయ్యారు. ఇదే విషయంతో పాటు పలు సమస్యలను విద్యార్థులు.. గతంలో ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో పిల్లలు ఈరోజు ఉదయం ఆందోళనకు దిగారు.
స్కూల్లో తమను వేధిస్తున్నారంటూ గేటు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. బయట నుంచి లోనికి ఎవరినీ అనుమతించకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు నిరసనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్పందించిన రీజినల్ కో ఆర్డినేటర్, అంటెండర్‌ను సస్పెండ్ చేసి.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి లక్ష్మీని తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. పాఠశాల వైస్ ప్రిన్సిపల్ రామారావుకు ప్రిన్సిపల్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పజెప్పారు.
అసలు ఏం జరిగిందంటే..: స్కూల్ సిబ్బంది తమను వేధిస్తున్నారని.. దుమాల గ్రామంలోని తెలంగాణ స్టేట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ఉదయం ఆందోళన చేశారు. ఎల్లారెడ్డిపేట కేంద్రం ప్రధాన చౌరస్తా వద్ద ధర్నా చేశారు. ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి, వార్డెన్ రమ్య, అటెండర్ రామస్వామి తమను వేధిస్తూ, దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ విద్యార్థినులు ఆరోపించి తెల్లవారుజామున 5 గంటలకే దాదాపు 50 మంది విద్యార్థినులు మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే వారిని విధుల నుంచి బహిష్కరించాలని.. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు.
నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థినులకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ చలిలో విద్యార్థినులు భీష్మించుకుని కూర్చున్నారు. భోజనం చేసేటప్పుడు చారులో వానపాములు కనిపించాయని చూపించినా.. వార్డెన్ పట్టించుకోలేదని విద్యార్థినులు తెలిపారు. ఈ విషయాలపై ప్రిన్సిపాల్‌కి చెప్పడానికి వెళితే.. కనీసం తమవైపు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ ఖర్చులకు గవర్నమెంట్ వేసిన డబ్బును ఖర్చుపెట్టలేదని చెప్పారు. ఎటువంటి క్రీడలకు ఆమె డబ్బును అసలు ఖర్చుచేయడం లేదని ఆరోపించారు. వార్డెన్ రాత్రి సమయంలో ఆల్కాహాల్ సేవించి.. వచ్చి తమను దుర్భాషలు ఆడేవాడని వాపోయారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: