కాలుష్యకోరల మధ్య, మానసిక ఒత్తిడికి గురవుతూ చిన్నచిన్న సమస్యలకే ఆందోళన చెందే నేటితరం మానసిక ప్రశాంతత కోసం యోగాను ఆశ్రయిస్తోంది. సాత్వికాహారం, యోగా.. మనిషి పరిపక్వత చెందడానికి మార్గమని నమ్మిన ప్రజలు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా యోగాను ఆశ్రయిస్తున్నారు. దినచర్యలో భాగం చేసుకుని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతున్నారు.
84 ఆసనాలు
యోగాలో ఎనిమిది రకాలు ఉన్నాయి. యమము, నియమం ,ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, దారణం, ధ్యానం, సమాధి. ఈ యోగసాధనలో ప్రధానంగా పాటించాల్సిన అంశాల్లో యమ నియమాలు, ఆసన ప్రాణాయామాలు ముఖ్యమైనవి. మన ఋషులు అందించిన 84 లక్షల ఆసనాలు ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నా 84 ఆసనాలు మాత్రమే వాడుకలో ఉన్నాయి.
ముఖ్యమైనవి ఇవే
వజ్రాసనం, సిద్ధాసనం, పద్మాసనం ,సర్వాంగాసనం, శిర్షాసనం అర్ధమయూరాసనం, ఉప విశిష్ట కోణాసనం, చక్రాసనం, కటి చక్రాసనం, వ్యాగ్రా సనం, ప్రాణాయామం, సూర్యనమస్కారాలు, పాదహస్తాసనం, ఏకపాద కుంచిత సరళ భుజంగాసనం, ఉర్ద చక్రాసనం, సాష్టాంగ నమస్కార ఆసనం, భుజంగాసనం ఇందులో అతి ముఖ్యమైనవి.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
యోగాసనాల వల్ల ఎలాంటి ఆహారం తీసుకున్నా జీర్ణశక్తి పెరుగుంతుందని యోగా గురువు శివానంద్ తెలిపారు. యోగా... మోకాళ్ల నొప్పులు, తలకు సంబంధించిన రుగ్మతలను తొలగిస్తుంది. యోగాతో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. మహిళలకు సంబంధించిన ఉపవిష్టకోనాసనం గర్భసంచి సమస్యలు రాకుండా తోడ్పడుతుంది. పొట్ట దగ్గర ఉండే కొవ్వును కరిగిస్తుంది. ప్రాణాయామంతో శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి శ్వాస సంబంధ వ్యాధులు దూరమవుతాయి.
దినచర్యలో భాగం
ఆధునిక కాలంలో ఉరుకులు పరుగులు పెడుతున్న మనిషి యోగాను దినచర్యలో భాగం చేసుకుంటే ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరమే రాదని యోగా గురువులు చెబుతున్నారు.
- ఇదీ చూడండి : హెల్మెట్లతో గుజరాతీ యువత గార్బా నృత్యం