పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, గొల్లపల్లి గ్రామాల్లో తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసి ముద్దయింది. కోతలు పూర్తై వారం రోజులు గడవడం వల్ల రైతులు పెద్ద ఎత్తున వరి ధాన్యాన్ని అమ్మకానికి తీసుకొచ్చారు. ఫలితంగా సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సుమారు 4 వేల క్వింటాళ్లకు పైగా వరి ధాన్యం తడిసిపోయింది.
మరోవైపు గొల్లపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొనుగోలు కేంద్రంలోనూ భారీగా వరి ధాన్యం తడిసిపోయింది. సుమారు 2 వేల క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయింది. భారీ వర్షానికి కొంతమంది రైతుల ధాన్యం కొట్టుకుపోయింది. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోవడం వల్ల రైతులు ఉదయాన్నే తమ పంటను ఆరపెట్టుకునే పనిలో పడ్డారు. ధాన్యాన్ని కప్పిఉంచేందుకు అధికారులు టార్పాలిన్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షానికి తడిసిన తమ ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇవీచూడండి: కరోనాపై సీఎం కేసీఆర్ సమీక్ష.. లాక్డౌన్పై కీలక చర్చ