RFCL victim attempted suicide : కొంత మంది వ్యక్తులు ఉద్యోగం వస్తుందనే ఆశతో వ్యక్తిని నమ్మి అప్పు తెచ్చి డబ్బులు ఇస్తారు. తీరా చూస్తే ఎన్నిరోజులు అయిన వారికి ఉద్యోగం రాదు. మోసపోయామని తెలుసుకొని డబ్బులు ఇచ్చిన వ్యక్తిని నిలదీస్తారు. ఈ లోపు అప్పు పెరుగుతూ వస్తుంటుంది. మోసపోయామన్న మనస్తాపంతో చివరకు చనిపోడానికి సిద్దం అవుతున్నారు. ఇలానే పెద్దపల్లి జిల్లాలో ఉద్యోగం కోసం డబ్బలు ఇచ్చి.. మోసపోయాయని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలం ముర్మూర్ గ్రామానికి చెందిన చెరుకు తోట శ్రీనివాస్ నాలుగేళ్ల క్రితం రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్ఎఫ్సీఎల్)లో ఉద్యోగం కోసం ఎనిమిదిన్నర లక్షలు ఆ కంపెనీలోని కాంట్రాక్టర్ అయిన అమీర్ అనే వ్యక్తికి ఇచ్చాడు. అప్పటినుంచి ఉద్యోగం లేకపోగా.. ఇచ్చిన పైసలు తిరిగి రాలేదు. దీంతో మనోవేదనకు గురయ్యాడు. ఇదే సమయంలో కుటుంబ కలహాలు మరింత క్షోభకు గురిచేశాయి. ఉద్యోగం రాలేదనే ఒత్తిడితో ఈరోజు ఉదయం ఇంటిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అత్యవసర చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించాలని సూచించారు. కరీంనగర్‌కు తరలించగా.. అక్కడి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శ్రీనివాస్ లాగానే మోసపోయామని గ్రహించి గతంలో ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. మరో నలుగురు బాధితులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య సుమారు 150 మంది వరకూ ఉంటారు. గతంలో వీరంతా పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. వీరిలో కొంత మందికి సగం నగదు అందింది. శ్రీనివాస్‌కి నయా పైసా ముట్టలేదు.
ఎమ్మెల్యేనే బాధ్యుడు: బాధితుడ్ని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పరామర్శించారు. ఆర్ఎఫ్సీఎల్ బాధితులకు తాను ఉన్నానని హామీ ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. బాధితులకు పూర్తి డబ్బులు అందేలా చూస్తామని హామీ ఇచ్చిన ఆయన... స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన మాటకి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. రామగుండం ప్రాంతంలో ఎవరైనా బాధితులు ఆత్మహత్య చేసుకుంటే దానికి బాధ్యుడు ఎమ్మెల్యే అవుతారని హెచ్చరించారు.
"ఇప్పటికి ఆర్ఎఫ్సీఎల్ బాధితులు ఇద్దరు చనిపోయారు. మరో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పటి వరకు ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా దాటవేస్తూ వస్తోంది. కొంచెం డబ్బులు ఇచ్చిన వారు నగదు ఇస్తారనే ఆశతో ఉన్నారు. మరికొంత మంది ఆ ఆశ చచ్చిపోయి ఇలా ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని రోజులు విషయాన్ని బయటకి రాకుండా చూసినా ఆగదు. మీడియా సమక్షంలో నేను ఉన్నాను అనే భరోసా ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు ఏమీ చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటనకు వచ్చినప్పుడు బహిరంగంగా లేఖ రాశాను. వెంటనే పూర్తి స్థాయిలో బాధితులకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను."- రాజ్ ఠాకూర్ ,పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
ఇవీ చదవండి: