పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అధికారులపై వేటు పడింది. తహసీల్దార్ వేణుగోపాల్‌ను కలెక్టరేట్‌కు బదిలీ చేయగా వీఆర్వో, వీఆర్ఏను సస్పెండ్ చేశారు.
ఈనెల 20న కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద రాజిరెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎకరం 20 గుంటల భూమికి పట్టా ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం చేశారని సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. తన భూమిని రెవెన్యూ అధికారులు లంచం తీసుకుని మరికొందరి పేరుపై పట్టా చేసినట్లు ఆరోపించాడు. ఆత్మహత్యకు రెవెన్యూ అధికారులే కారణమని లేఖలో పేర్కొన్నాడు.
ఈ ఘటన విచారణ జరిపిన ఉన్నధికారులు రైతు ఆత్మహత్య కేసులో తహసీల్దార్, వీఆర్వో, వీఆర్ఏపై వేటు వేశారు. తహసీల్దార్ వేణుగోపాల్ బదిలీ చేస్తూ, వీఆర్వో గురుమూర్తి, వీఆర్ఏ స్వామిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. కాల్వశ్రీరాంపూర్ నూతన తహసీల్దార్‌గా సునీతను నియమించారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు రాజిరెడ్డి మరణానంతరం తాత్కాలికంగా పట్టా జారీ చేయడంలో తప్పులు దొర్లిన ఘటనపై విచారణ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.