కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల బ్యాక్‌వాటర్‌తో పంటలు మునిగి(Rains effect on crops in telangana)... నష్టపోతున్నామని అన్నదాతలు ఆందోళనకు దిగారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజి గేట్లు తెరవడం, మూయడంతో సమీప పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని అన్నారం బ్యారేజీ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వరద వచ్చిన ప్రతిసారి పంటలు మునిగి ఆర్థికంగా చితికిపోతున్నామని రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం తమ బాధను ఇప్పటికైనా అర్థం చేసుకొని న్యాయం చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల గోదావరి, ప్రాణహిత, మానేరు నదుల ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మహదేవపూర్ మండలంలో సూరారం, అన్నారం, అంబట్‌పల్లి, చంద్రుపల్లి, మద్దులపల్లి, పలుగుల, కుంట్లము గ్రామాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు(Rains effect on crops in telangana) రైతులు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి వెళ్తున్నా.... తమకు న్యాయం జరగడం లేదని వాపోయారు.
లోయర్ మానేరు డ్యామ్, ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, సుందిళ్ల బ్యారేజీల నుంచి లక్షలాది క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో గోదావరి, మానేరు నదులు ఉప్పొంగుతున్నాయి. కాటారం మండలం గంగారం, విలాసాగర్, లక్ష్మీపూర్ గ్రామాల వద్ద పత్తి, వరి పంటలు జలమయం(Rains effect on crops in telangana) అయ్యాయి. గంగపురి సమీపంలోని పెద్ద వాగు ఉప్పొంగడంతో పాటు నదిలో కలవలేక బ్యాక్ వాటర్‌తో పంటలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీపూర్ వద్ద మానేరు నది ఉప్పొంగి... పొలాల మధ్య నుంచి పాయగా ఏర్పడింది. మహదేవపూర్, కాటారం, మలర్, పలిమేల మండలాల పరిధిలో 3,980 ఎకరాల మేర పత్తి, వరి, మిర్చి పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
మాది అన్నారం ప్రాజెక్టు దిగువన ఉంటది. ఈ గోదావరి నీరు విడిసినప్పుడల్లా ఇది మూడోసారి మునిగింది. నేను రెండోసారి నాటు పెట్టినా. రెండోసారి కూడా పొలం పచ్చగా మారింది. ఇప్పుడు మొత్తం మళ్లీ మునిగిపోయింది. సుమారు రూ.లక్షకు పైనే నాకు ఖర్చయింది. నాది ఇక్కడ 4.15 ఎకరాల పొలం ఉంది. పొలమే కాదు ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు అన్నీ మునిగిపోతున్నాయి. ఈ బ్యారేజీల వల్ల ఎవరు లాభ పడుతున్నారో కానీ మేమైతే బాగా నష్టపోతున్నాం. దీనిపై స్పందించి నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం.
-నష్టపోయిన రైతు
పొలాల్లో చేరిన బ్యారేజీ బ్యాక్ వాటర్.. అన్నదాత కష్టం నీళ్లపాలు!
ఇదీ చదవండి: Hyderabad Rains: అవే కాలనీలు.. అదే కన్నీరు.. ఇంకేన్నాళ్లీ హైదరా'బాధలు'!