పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పాలకవర్గం సాధారణ సమావేశం గందరగోళంగా జరిగింది. కార్పొరేషన్ కార్యాలయంలో ఉదయం 11గంటలకు ప్రారంభమవగానే అభివృద్ధిపై రసాభాసగా చర్చలు మొదలయ్యాయి. ఎస్సీ కార్పొరేటర్లు ఉన్న డివిజన్లలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల మంజూరులో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. మేయర్ అనిల్ కుమార్ పొడియం వద్ద బైఠాయించారు. నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. నగర పాలక ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ పాలకవర్గంతో వాదనకు దిగారు.
ఆగ్రహానికి గురైన తెరాస కార్పొరేటర్లు.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెరాస, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. ఒకనొక దశలో ఎదురు దాడులకు దిగే పరిస్థితులు నెలకొనగా.. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. సుమారు రెండు గంటల పాటు సమావేశ మందిరం గందరగోళంగా కనిపించింది. అభివృద్ధికి సంబంధించిన ఎజెండాను పాలకవర్గం చదివి వినిపించగా.. మూడో వంతు మద్దతు లభించింది.
అభివృద్ధికి సహకరించాల్సిన కార్పొరేటర్లు ఇష్టానుసారంగా వ్యవహరించడం సరైన విధానం కాదని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ప్రజలు తమపై ఉన్న నమ్మకంతో ప్రజాప్రతినిధులుగా గెలిపించారన్నారు. అభివృద్ధిని పక్కనపెట్టి కొందరు రాజకీయ డ్రామాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసులో ఏడుగురి అరెస్టు