నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వేంచిర్యాలలో దారుణం చోటుచేసుకుంది. తమ మాటను దిక్కరించారనే అక్కసుతో ఆ గ్రామ కమిటీ 25 మందిని బహిష్కరించింది.
వేంచిర్యాల గ్రామంలోని 125 సర్వే నెంబర్ అసైన్డ్ భూమిలో పశపు గంగయ్య అనే వ్యక్తి ఇరవై సంవత్సరాలుగా సాగు చేస్తున్నాడు. ప్రభుత్వ భూములను ఇచ్చేయాలని ఆ గ్రామ అభివృద్ధి కమిటీ చెప్పగా... అందరూ ఇస్తే తాను ఇస్తానని తెలిపాడు. ఇన్ని సంవత్సరాలు సాగు చేసినందుకు గానూ... లక్షా అరవై రెండు వేలు చెల్లించాలని వారు సూచించారు.
బాధితుడు డబ్బులు ఇవ్వలేనని, భూమిని ఇస్తానని చెప్పడంతో గంగయ్యతోపాటు అతనికి సహకరించిన 25 మంది వర్గ సభ్యులను... వారి కుటుంబాలను గ్రామపెద్దలు బహిష్కరించారు.
వారితో ఎవరూ మాట్లాడకూడదని... ఉల్లంఘిస్తే లక్ష జరిమాన విధిస్తామని తీర్మానం చేశారు. ఈ ఘటనతో గంగయ్య తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముప్కాల్ ఎస్సై తెలిపారు.
ఇవీ చూడండి: కొత్తగా ఏపీ మంత్రివర్గంలో చేరేది ఆ ఇద్దరేనా?