రాజ్యసభ, శాసనమండలి అభ్యర్థుల ఎంపికపై తెరాస తుది కసరత్తు చేస్తోంది. రాజ్యసభ, శాసన మండలి స్థానాలపై తెరాస వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు రాజ్యసభ, రెండు శాసన మండలి స్థానాలకు అభ్యర్థుల ఖరారు కోసం తెరాస నాయకత్వం కసరత్తు చేస్తోంది. నలుగురు అభ్యర్థుల పేర్లను పార్టీ అధినేత కేసీఆర్ ఈ రాత్రి లేదా రేపు ప్రకటించనున్నారు. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే దాదాపు డజను పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.
ప్రచారంలో ఉన్న పేర్లు...
పదవీకాలం ముగుస్తున్న కె.కేశవరావుతోపాటు.. మాజీ ఎంపీలు కవిత, వినోద్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతారాం నాయక్, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, నాయని నర్సింహారెడ్డి, మాజీ స్పీకర్లు సురేష్ రెడ్డి, మధుసూదన చారి, గ్యాదరి బాలమల్లు, పారిశ్రామిక వేత్త పార్థసారథిరెడ్డి, కేసీఆర్ సన్నిహితుడు దామోదర్ రావు పేర్లు ప్రధానంగా పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. ఒకటి ఓసీకి.. మరోస్థానం బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఒకరికి ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కేకేకు మరోసారి!
మరోసారి తనకు అవకాశం లభిస్తుందని కేకే పూర్తి విశ్వాసంతో ఉన్నారు. కేసీఆర్ కూడా కేకేకు హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మిగతా ఆశావహులందరూ అసెంబ్లీలో కేసీఆర్, కేటీఆర్‌ను కలిసి.. తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూనే ఉన్నారు. సీఎం కేసీఆర్ సన్నిహితుడు దామోదర్ రావు, హెటిరో సంస్థ ఎండీ పార్థసారథి రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లు తుది పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ ప్రగతి భవన్లో కేసీఆర్‌ను ముగ్గురు నేతలు కలిసినట్లు సమాచారం.
ఎమ్మెల్సీ ఏకగ్రీవమయ్యే అవకాశం
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో తెరాస అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగే అవకాశాలున్నాయి. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డికి రాజ్యసభ స్థానం ఇవ్వకపోతే.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. గవర్నర్ కోటాలో సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌తోపాటు... టీఎస్ఎండీసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు పేర్లను పరిశీలిస్తున్నారు.
ఇదీ చూడండి: భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్