నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని మోస్రా మండల కేంద్రంలో రూ. 1.51 కోట్లతో నిర్మించిన 30 రెండు పడక గదుల ఇళ్లను శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. జడ్పీ హైస్కూల్‌లో రూ. 86 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. రూ. 42 లక్షలతో నిర్మించే పెద్దమ్మ దేవాలయానికి, రూ. 30 లక్షలతో నిర్మించే జనరల్ ఫంక్షన్ హాల్‌కు శంకుస్థాపన చేశారు.
గోవూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ భవనం, రైతువేదికను పోచారం ప్రారంభించారు. గ్రామంలోని ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 33/11 కేవీ సబ్ స్టేషన్‌ను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు పరిచి పేద కుటుంబాలకు, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటోందని పోచారం పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, ఎమ్మార్వో రజని, తెరాస నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: విపత్తుల నుంచి కాపాడతామన్నారు.. ఇప్పుడు ముంచేస్తున్నారు!