రాష్ట్రంలో సాధారణంగా దొడ్డు రకం వరి అధికంగా సాగవుతుంది. 70శాతం దొడ్డు సాగైతే... 30శాతం సన్నాలు సాగు చేసేవారు. అయితే ఈ ఏడాది ప్రభుత్వం నియంత్రిత సాగు విధానంలో భాగంగా 50-50శాతంలో సన్నాలు సాగు చేయాలని సూచించింది. దీంతో చాలా మంది రైతులు ప్రభుత్వం చెప్పిన విధంగా సన్నాలే సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలకు తోడు తెగుళ్లు రైతుల నడ్డి విరిచాయి. ఎప్పుడూ సాగు చేసే దొడ్డు రకం వేసినా కనీసం శ్రమకు వేతనమైనా లభించేదన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వమే స్వయంగా సన్నాలు సాగు చేయాలని చెప్పడం వల్ల మద్ధతు ధర పెరుగుతుందని రైతులు భావించారు. కానీ వాస్తవ పరిస్థితులు మరోలా ఉన్నాయి. దీనికి తోడు మార్కెట్లోనూ సన్నాలకు ధరలు పడిపోవడం వల్ల.. అన్నదాత లబోదిబోమంటున్నాడు.
తెగుళ్లు వీడకపాయే..
సన్నాల సాగుతో తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దొడ్డు రకంతో పోలిస్తే పెట్టుబడి పెరగడం సహా తెగుళ్లతో పైమందులు అధికంగా కొట్టాల్సి వచ్చిందని చెబుతున్నారు. దోమపోటు, కాటుక తెగులు, ముగి పురుగు వంటి తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టాలు ఎదురయ్యాయని అంటున్నారు. దోమపోటు నివారణ కోసం రెండు నుంచి ఐదుసార్లు పురుగుల మందు పిచికారి చేశామని రైతులు వాపోతున్నారు. ఎంతకీ తెగుళ్లు వీడకపోవడం వల్ల పలువురు రైతులు పంటకు నిప్పుపెడుతున్నారు.
ఆర్థికంగా చితికిపోయాం..
ఇక దిగుబడి సైతం దొడ్డు ముందు సన్నాలు దిగదుడుపే అవుతున్నాయి. దొడ్డు రకం ఎకరానికి 30 నుంచి 32క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా... సన్నాల్లో 22నుంచి 24క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది. దొడ్డు రకం పంట విక్రయిస్తే రైతుకు 56వేల 400 నుంచి 60వేల 160వరకు వస్తోంది. పెట్టుబడి పోను కనీసం 20వేలు మిగులుతోంది. అదే దొడ్డులో అయితే 41వేల360నుంటి 45వేల120 వస్తోంది. ఈ లెక్కన పెట్టుబడిని కూడా ఆదాయం దాటడం లేదు. కోత కోసే వరకు పురుగు మందు పిచికారి చేయాల్సి రావడం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. సన్నాల సాగుతో తాము ఆర్థికంగా చితికిపోయామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం స్పందించాలి
సన్నాల సాగులో ఇబ్బందులను గమనించి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని రైతులు కోరుతున్నారు. 2వేల 500 రూపాయల మద్దతు ధర కల్పిస్తేనే పెట్టుబడయినా మిగులుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: ధరణి.. భారతదేశానికే ట్రెండ్ సెట్టర్: సీఎం కేసీఆర్