నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనందికి చెందిన మగ్గిడి శ్రీనివాస్‌కు భార్య లక్ష్మి, కుమారులు సంతోశ్, విష్ణువర్ధన్, కుమార్తె స్వార్థిక ఉన్నారు. భార్య బీడీలు చేస్తుండగా.. శ్రీనివాస్ స్థానికంగా కూలీనాలీ చేస్తూ బతుకుబండిని లాగేవారు. ఖర్చులు ఎక్కువై ఆదాయం సరిపోకవపోవడం వల్ల ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాలని భావించాడు శ్రీనివాస్. నాలుగేళ్ల కింద తెలిసినవాళ్ల దగ్గరు అప్పు చేసి.. భార్యాబిడ్డల్ని వదిలి బహ్రెయిన్ వెళ్లాడు. ఓ కంపెనీలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నెమ్మదిగా చేసి అప్పులు తీర్చడం మొదలుపెట్టిన శ్రీనివాస్.. జీవితం సాఫీగా సాగుతోందని భావిస్తున్న తరుణంలో అనుకోని ఉపద్రవం ఎదురైంది.
ప్రమాదవశాత్తు జారిపడి..
గతేడాది సెప్టెంబర్ 1న పని ముగించుకుని అతని రూమ్‌కు వచ్చి స్నానం చేసేందుకు వెళ్లిన శ్రీనివాస్ .. బాత్రూమ్లో ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడం వల్ల స్నేహితులు అక్కడి ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. తలకు గాయం కావడం వల్ల శ్రీనివాస్ ఎడమ వైపు శరీరం పూర్తిగా చచ్చుబడిపోయింది. 20 రోజుల తర్వాత కోమాలో నుంచి బయటపడినా... మాట్లాడలేకపోతున్నాడు. కేవలం ద్రవపదార్థాలు తప్ప.. ఆహారం తీసుకోలేని దుస్థితి నెలకొంది. శస్త్ర చికిత్స చేసినా.. సరైన వైద్యం అందక పరిస్థితి మరింత దయనీయంగా మారడం వల్ల కంపెనీ ప్రతినిధులు.. శ్రీనివాస్‌ను స్వగ్రామానికి పంపించారు.
రూ.15 లక్షలు ఖర్చవుతుంది..

బహ్రెయిన్ నుంచి శ్రీనివాస్‌ను భారత్‌కు పంపేందుకు పలుమార్లు ప్రయత్నం చేసినా.. కరోనా కారణంగా విమాన రాకపోకలు లేకపోవడం వల్ల కుదరలేదు. 20 రోజుల కింద శ్రీనివాస్‌ను స్వదేశానికి పంపించారు. ఈ క్రమంలో దాదాపు నాలుగు నెలలు కాలయాపన జరిగింది. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్‌ను కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆరు రోజుల పాటు చేసిన ఈ చికిత్సకు రూ.2లక్షలు అయింది. శ్రీనివాస్ ఆరోగ్యం మెరుగు పడాలంటే.. మరో రూ.15లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో హతాశులయ్యారు. ఆ స్తోమత లేక శ్రీనివాస్‌ను ఇంటికి తీసుకొచ్చారు.
మా నాన్నను బతికించండి..

కుటుంబానికి ఏ కష్టం లేకుండా చూడాలని భావించి.. తమకు దూరంగా వెళ్లి రాత్రింబవళ్లు కష్టపడిన శ్రీనివాస్.. ఇప్పుడు చావుబతుకుల్లో మంచానికే పరిమితమై దీనస్థితిలో ఉన్నాడని అతని భార్య లక్ష్మీ కన్నీరుమున్నీరయ్యారు. తమ ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఆరోగ్య శ్రీ కింద శ్రీనివాస్‌కు వైద్యం అందించాలని అతని భార్య లక్ష్మీ కోరారు. స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి తమకు సాయం చేయాలని అర్థించారు. ఇంటికి వెళ్లిన ప్రతిఒక్కర్ని మా నాన్నను బతికించండంటూ వేడుకుంటున్న ఆ పిల్లల్ని చూసి స్థానికులు కంటతడి పెడుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం వారికి సాయం చేయాలని కోరుతున్నారు.
- ఇదీ చూడండి : 'నేను కాళికను.. నేనే శివుడిని'