Students Came from Ukraine: ఉక్రెయిన్ నుంచి పలువురు తెలంగాణ విద్యార్థులు క్షేమంగా స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన ముప్పరాజు వినయ్ ఈరోజు(మార్చి 4న) ఉదయం సురక్షింతంగా ఇంటికి చేరుకున్నాడు. రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల తాము కొంత భయాందోళనలకు గురయ్యామని తెలిపిన వినయ్.. యుద్ధం కంటే ఎక్కువగా తమ తల్లిదండ్రుల ఆందోళన గురించి ఎక్కువ ఆలోచించామన్నాడు.
యుద్ధంలో ఉక్రెయిన్‌దే విజయం..
తామున్న ప్రాంతంలో యుద్ధ వాతావరణం లేదని.. అందుకు సంబంధించిన సంకేతాలు మాత్రం కనిపించేవని వివరించారు. అక్కడి ప్రజలు చాలా ధైర్యంగా ఉన్నారని.. యుద్ధంలో విజయం సాధిస్తామని ధీమాగా ఉన్నట్టు తెలిపారు. ఉక్రెయిన్ నుంచి ఇంటివరకు సురక్షితంగా రావడానికి అన్నివిధాలా సహకారం అందించిన ఇండియన్ ఎంబసీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వినయ్.. ధన్యవాదాలు తెలిపాడు.
"మేమున్న ప్రాంతంలో అంతగా యుద్ధ ప్రభావం లేదు. కానీ.. అక్కడి మిలటరీ బలగాలు ఎప్పటికప్పుడు సంకేతాలు ఇస్తుండేవి. దాడి జరిగినా.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు నుంచే అన్ని ఏర్పాట్లు అక్కడ చేశారు. ఉక్రెయిన్ నుంచి రుమేనియా రావటానికి యూనివర్సిటీ వాళ్లే బస్సు పెట్టారు. అక్కడి నుంచి ఇండియన్ ఎంబసీ వాళ్లు చూసుకున్నారు. ఇంటికి సురక్షితంగా వచ్చేలా చర్యలు తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు. ఉక్రెయిన్ ప్రజలు వాళ్ల స్వతంత్రాన్ని మళ్లీ తిరిగి పొందాలని కోరుకుంటున్నా. ఉక్రేయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో పాటు ఆయన బృందానికి ఆల్‌ది బెస్ట్. యుద్ధం ముగిసిపోయి.. మళ్లీ రెండు మూడు నెలల్లో అంతా సర్ధుకుంటే వెళ్లి డాక్టర్ పట్టా పొందాలి." - వినయ్, మెడిసిన్ విద్యార్థి
తమ కుమారుడు ఇంటికి చేరడంతో వినయ్ తల్లిదండ్రులు ఆనందంలో మునిగితేలారు. తమ కొడుకును ఇంటికి భద్రంగా చేర్చిన ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి: