రాష్ట్రంలో ఎండలు తీవ్రమవుతున్నాయి. అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తుతున్నారు. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా నిజామాబాద్, ఆదిలాబాద్, రామగుండం ప్రాంతాల్లో ఎండలకు జనం ఠారెత్తిపోతున్నారు. నిజామాబాద్‌లో ఏటా ఉష్ణోగ్రత 45డిగ్రీలు దాటుతోంది. ఈ ఏడాది సైతం మార్చి నెల నుంచే ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు జనం బేజారవుతున్నారు.
ఎండలు దంచి కొడుతున్నాయి..
ఏటా ఏప్రిల్‌లో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఈ ఏడాది మార్చి ప్రారంభం నుంచే కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం అధిక మాసం రావడం వల్లే... మార్చిలోనే ఏప్రిల్ ఎండల తీవ్రత కనిపిస్తోందని ప్రజలు చెబుతున్నారు. మార్చి 3న ఈ సీజన్‌లో అత్యధికంగా 38.6డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత వారం రోజులుగా 37 డిగ్రీలకు తగ్గకుండా ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రజలు అత్యవసర పనులుంటే తప్ప ఇళ్ల నుంచి ప్రజలు బయటకు వచ్చేందుకు ఇష్ట పడడం లేదు.
బెంబేలెత్తిపోతున్న జనం
ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఎండలను ఊహించుకుని ప్రజలు భయపడిపోతున్నారు. ఈ ఏడాది ఎండలు అధికంగా ఉంటాయని భావిస్తున్నారు. ఎండలు పెరిగిన నేపథ్యంలో శీతల పానియాలు, కొబ్బరిబొండాలు, పండ్ల రసాలను ప్రజలు ఉపశమనం కోసం ఆశ్రయిస్తున్నారు.
ఇదీ చదవండి: బడ్జెట్ సమావేశాలకు తగు నివేదికలతో సిద్ధం కావాలి: సీఎస్