తరగతి గదుల్లో విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడమే కాకుండా సమాజ సేవలోనూ ముందుంటామని నిరూపిస్తున్నారు నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఉమ్మడి మండల ప్రభుత్వ ఉపాధ్యాయులు. లాక్డౌన్ కారణంగా కాలినడకన స్వస్థలాలకు పయనమైన కూలీల కడుపు నింపాలని ఉమ్మడి బాల్కొండ మండల విద్యాశాఖాధికారి బట్టు రాజేశ్వర్ తలిచారు. అనుకున్నదే తడవుగా.. మండలంలోని ఉపాధ్యాయులు, దాతల సహకారంతో లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు వలసకూలీలకు భోజనాలు అందిస్తున్నారు.
షిఫ్టులవారిగా విధులు...
ఉదయం 9 గంటల నుంచి పోచంపాడ్, ముప్కాల్, చేపూర్ వద్ద నిరంతరాయంగా ఆహారం లభిస్తోంది. రాత్రి 9 గంటల వరకు ఉపాధ్యాయులు షిఫ్టులుగా విధులు కేటాయించుకుని సేవ చేయడం విశేషం. ఆహారంతో పాటు పిల్లలకు బిస్కెట్లు, అరటిపండ్లు అందజేస్తున్నారు. మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ అనునిత్యం ఆహారం అందించడంలో ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేస్తూ... వలసకూలీల సేవలో నిమగ్నమయ్యారు.
సోషల్ మీడియాలో చూసి ముందుకొస్తున్న దాతలు..
ఆహారం అందించటమే కాకుండా రహదారిపై వెళ్లే వాహనదారులతో మాట్లాడి కూలీలను ఎక్కించి పంపిస్తున్నారు. సొంత వాహనాలు సమకూర్చుకున్న వారికి పెట్రోల్ కోసం డబ్బులు అందజేస్తున్నారు. మోతె గంగారెడ్డి అనే యువకుడు తోడై సామాజిక మాధ్యమాల ద్వారా వలసకూలీల ఇబ్బందులను ప్రపంచానికి తెలియజేశాడు. వీడియోలు చూసిన చాలా మంది సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ చక్రపాణి లాంటి వారు కూడా తమ వంతు సాయం అందించారు.