Bandi Sanjay On dgp: డీజీపీకి తెలిసే ఎంపీ అర్వింద్‌పై దాడి జరిగిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. డీజీపీ, ఎస్పీ ఫోన్ కాల్‌కు స్పందించడం లేదని అన్నారు. ఎంపీపై దాడి జరిగిందంటే ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని విమర్శించారు. అర్వింద్‌పై దాడి, భాజపా కార్యకర్తలపై హత్యాయత్నం చేశారని అన్నారు. దాడి చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రవర్తన మార్చుకోవాలని హితవు పలికారు.
'తెరాస కార్యకర్తలు, గుండాలు, పోలీసులు కలిసి ఎంపీ అర్వింద్‌పై దాడి చేశారు. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్, ఫామ్‌హౌస్‌లో కూర్చోని భాజపా కార్యకర్తలపై దాడి చేయాలని ఉసిగొలుపుతున్నారు. అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి అర్వింద్ వెళ్లారు. ఫామ్‌హౌస్, ప్రగతి భవన్‌కు రాలేదు కదా? భాజపా కార్యకర్తలపై హత్యాయత్నం చేశారు. రక్షణ కల్పించాలని సీపీకి ఎంపీ ఫోన్ చేసి అడిగినా సీపీ ఫోన్ ఎత్తే పరిస్థితి లేదు.'
- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడిందని బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆరే శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు ప్రజలను కాపాడే పరిస్థితుల్లో లేరని విమర్శించారు. కొంత మంది అధికారులు సీఎం, తెరాస పార్టీ ప్రజాప్రతినిధులకు కొమ్ముకాస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ స్పందించాలని అన్నారు. ఎంపీపై దాడి చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై తమ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
ఖమ్మం జిల్లాలో యువకుడి ఆత్మహత్య బాధాకరమని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం రాదన్న మనస్తాపంతోనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి : ఎంపీ అర్వింద్ వాహనంపై రాళ్లతో దాడి చేసిన తెరాస శ్రేణులు
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!