సంక్రాంతి పర్వదినం సందర్భంగా అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఉదయం సుప్రభాత సేవ అనంతరం స్వామివారిని ఆభరణాలు, రంగురంగుల పూలతో అలంకరించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు.
ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో గ్రామ పురవీధుల వెంట మేళాతాళాలతో స్వామివారికి ఊరేగింపు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోనే మొదటి అయ్యప్ప ఆలయం కావడంతో భక్తులు పెద్దఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం మెట్ల పూజ నిర్వహించి మకరజ్యోతి వెలిగించారు. వేడుకల్లో పాల్గొన్న భక్తులకు నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ గురుస్వామి నర్సారెడ్డి ఆధ్వర్యంలో శ్రీధర్మశాస్త్ర ట్రస్ట్ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.