రాష్ట్రంలో రైతు ప్రభుత్వం నడుస్తోందని... దేశంలోని రైతులంతా తెలంగాణ వైపు చూస్తున్నారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. కార్యక్రమంలో అధ్యక్షులుగా నర్మద, ఉపాధ్యక్షులుగా సురేంద్రతో పాటు మరో ఎనిమిది మంది డైరెక్టర్ల ప్రమాణస్వీకారం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని... అందుకే కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ రైతులకు ఎలాంటి కష్టం కలుగకుండా మొక్కజొన్న, వరి ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టారన్నారు. జిల్లాలో దాదాపు రూ. 200 కోట్లు రైతుల ఖాతాల్లో పడనున్నాయన్నారు. ఇలాంటి రైతు రాజ్యంలో మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం రైతుల శ్రేయస్సుకు పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మంత్రి సూచించారు.