నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని బ్రహ్మణ్ గాంవ్ గ్రామంలో ఇటీవల ఎన్నికైన వార్డు సభ్యులు.. ఎన్నికల ఖర్చులను చూయించలేదని ఎన్నికల కమిషన్ ఏకంగా ఏడుగురు వార్డు సభ్యులను పదవి నుంచి తొలగించింది. దీంతో గ్రామంలో ఉన్న పంచాయతీ పాలక వర్గం ఖాళీ అయింది. కేవలం సర్పంచి, ఉపసర్పంచి మాత్రమే మిగిలారు. ఈ గ్రామంలో సుమారుగా 4 వేల జనాభా, 1200 ఓటర్లుంటారు. సర్పంచి, 8 మంది వార్డు సభ్యులుంటారు. ఇందులో ఏడుగురు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఒక వార్డు సభ్యునికి మాత్రమే ఎన్నిక జరిగింది. ఎన్నికైన వార్డు సభ్యుడితో కలిపి మొత్తం ఎనిమిది మంది వార్డు సభ్యులున్నారు. ఇందులో ఏడుగురు ఎన్నికల ఖర్చులు చూయించలేదని ఎన్నికల సంఘం వారిని పదవి నుంచి తప్పించింది.
ఎన్నికలైన వెంటనే తామందరం ఒకేసారి సంబంధిత అధికారులకు ఎన్నికలకు సంబంధించిన ఖర్చుల వివరాలను అందజేసినా.. అధికారులు తమకు ఎలాంటి రశీదులు ఇవ్వలేదని వార్డు సభ్యులు తెలిపారు. 'మీకేందుకు మేము అందరిది కలిసి పంపిస్తాం' అని అధికారులు చెప్పారని పేర్కొన్నారు. కానీ తమకు నోటీసులు వచ్చేవరకు తొలగించే విషయం తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారుల తప్పిదం వల్లనే తమను తొలగించారని ఆరోపించారు. అధికారులు మాత్రం ఎన్నికల ఖర్చుల వివరాలను ఇవ్వకపోవడంతోనే కమిషన్ వారిని తొలగించిందని పేర్కొన్నారు.
'గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామనే నమ్మకంతో మమ్మల్ని ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఓటర్లు ఎన్నుకున్నారు. పాలకవర్గంలో గ్రామంలో నెలకొన్న సమస్యలపై చర్చించి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. ఎన్నికల్లో పోటీకి అయిన ఖర్చుల వివరాలను సంబంధిత అధికారులకు పంపించాం. కానీ వారు ఇవ్వలేదని చెబుతున్నారు. దానికి సంబంధించిన రశీదులు ఏమైనా ఉంటే తీసుకురావాలని అంటున్నారు. నిర్లక్ష్యం చేసిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి.'
సాగర, వార్డు సభ్యురాలు
'గతంలో చేసిన పనులను చూసి గ్రామస్థులు నన్ను రెండోసారి ఎన్నుకున్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే తపనతో అందరం కలిసి పనిచేస్తున్నాం. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్ల మేము పదవిని కోల్పోయాం.'
సాయన్న, వార్డు సభ్యుడు
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చులను అందజేయలేదని ఎన్నికల కమిషన్.. మండలంలోని ఆయా గ్రామాల్లో 28 మంది వార్డు సభ్యులను తొలగించిందని ఎంపీడీవో సురేష్ బాబు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులతో సంబంధిత వార్డు సభ్యులకు నోటీసులను అందజేశామని చెప్పారు.