గురుకుల పాఠశాలలపై కరోనా మహమ్మారి గురి పెట్టింది. చిన్నారులపై తన ప్రతాపం చూపిస్తోంది. రోజురోజుకు చిన్నారుల్లో పాజిటివ్ కేసులు బయటపడుతుండటం... తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా గురుకుల పాఠశాలలు, వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థుల్లో ఎక్కువగా కేసులు రావటం... కొంత భయాందోళనకు దారితీస్తోంది.
- రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రభుత్వ గిరిజన వసతిగృహంపై కరోనా కన్నెర్ర చేసింది. 102 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా... 24 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వార్డెన్ మురళీతోపాటు 24 మంది విద్యార్థులకు కరోనా నిర్ధరణ కాగా... వసతిగృహంలోని రెండో అంతస్తులో హోమ్ ఐసోలేషన్ ఏర్పాట్లు చేసి చికిత్స అందిస్తున్నారు. శంషాబాద్ చిన్నగోల్కొండ ప్రభుత్వ పాఠశాలలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. పాఠశాలలోని 48 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... ఇద్దరికి కొవిడ్ నిర్ధరణ అయింది.
- నిర్మల్ జిల్లాలోని భైంసా బాలుర గురుకుల పాఠశాలలో కరోనా కలకలం కొనసాగుతోంది. కొత్తగా మరో 25 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. పాఠశాలలో మొత్తం 247 మంది విద్యార్థులుండగా... రెండు రోజుల్లో 190 మందికి పరీక్షల నిర్వహించారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి మొత్తం 35 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. పాఠశాల యాజమాన్యం మిగతా విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించనుంది. బాధిత విద్యార్థులను హోంఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
- ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు సెంట్‌పాల్ స్కూల్‌లో ముగ్గురు విద్యార్థులకు కరోనా నిర్ధరణ అయింది. గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ ఒప్పంద ఉపాధ్యాయునికి కరోనా సోకింది.
- కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ గురుకులంలోనూ మహమ్మారి పంజా విసురుతోంది. వసతిగృహంలోని 10 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మిగతా విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు.