CM KCR Public Meeting at Bhainsa Today : ఎవరో వచ్చి చెప్పిన అబద్ధాలు నమ్మి.. గుడ్డిగా ఓటు వేయవద్దని.. పోటీ చేస్తున్న వ్యక్తి.. అభ్యర్థి వెనక ఉన్న పార్టీ.. దాని చరిత్రను చూసి ఓటు వేయాలని భైంసా ఓటర్లకు బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR) తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా ప్రజల్లో ప్రజాస్వామ్య పరిణతి రాలేదని ఆవేదన చెందారు. నిర్మల్ జిల్లాలోని భైంసాలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభ(BRS Praja Ashirvada Sabha)లో పాల్గొని.. కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఓటర్లకు పలు సూచనలు చేస్తూ.. కాంగ్రెస్, బీజేపీలపై విమర్శనాస్త్రాలు సంధించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతోందని.. అయినా ప్రజల్లో ప్రజాస్వామ్య పరిణతి రాలేదని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎన్నికలు రాగానే ఎవరెవరో వస్తారని.. ఏదేదో చెబుతారని.. వారి మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. పార్టీల చరిత్ర, వాళ్ల దృక్పథం చూసి వివేకంతో ఓటు వేయాలని సూచించారు. దశాబ్దాలుగా వెనుకబడి ఉన్న ఎస్సీలు బాగుపడాలనే దళితబంధు పథకాన్ని తీసుకువచ్చినట్లు వివరించారు.
ఈసీ అనుమతిస్తే రైతు రుణమాఫీ ఇప్పుడే ఇస్తాం : కేసీఆర్
BRS Praja Ahsirvada Sabha at Bhainsa : రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని బైంసా ప్రజలకు కేసీఆర్ తెలిపారు. రైతులకు 24 గంటల కరెంటు అవసరం లేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మండిపడ్డారు. రైతులకు కరెంటు, ఉచితంగా నీళ్లు, పెట్టుబడి సాయం చేస్తున్నామని పేర్కొన్నారు. ధరణి పోర్టల్(Dharani Portal) తీసేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.. ఆ పోర్టల్‌నే తీసేస్తే రైతుబంధు, రైతు బీమా ఎలా వస్తాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో 24 గంటల కరెంటుతో వ్యవసాయంలో ఎన్నో మార్పులు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు.
"నిర్మల్, హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లలో హిందువులు, ముస్లింలు ఉన్నారు. ఎన్నో వందల ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలోనే ఉన్నారు. ఎవరి పని వారు చేసుకొని బతుకుతున్నాం. కొన్ని పార్టీల వాళ్లు భైంసా అంటే మతకల్లోలాలతో కొట్టుకునే ప్రాంతంగా చిత్రీకరిస్తున్నారు." - కేసీఆర్, బీఆర్‌ఎస్ అధినేత
CM KCR Election Campaign at Bhaisna : రాష్ట్రానికి మోదీ సర్కార్ ఒక్క వైద్య కళాశాల కూడా ఇవ్వలేదని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే ఒక్క నవోదయ విద్యాలయం కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రానికి ఏమీ ఇవ్వని మోదీ సర్కారు ఓట్లు ఎలా అడుగుతాయని మండిపడ్డారు. దశాబ్దాలుగా వెనుకబడి ఉన్న ఎస్సీలు కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చి.. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి ఆదుకుంటున్నామని స్పష్టం చేశారు. ఒక పార్టీ మతం పేరు చెప్పి ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని పరోక్షంగా విమర్శలు చేశారు. భైంసా అంటే యుద్ధక్షేత్రం అనుకునేలా బీజేపీ దుష్ప్రచారం చేసిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.