నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీ విద్యాలయం (RGUKT College)లో ఆర్థిక వనరులు నిండుకున్నాయి. ప్రస్తుతం విద్యాలయానికి చెందిన బ్యాంకు ఖాతాల్లో రూ.24 వేలే ఉండటం విద్యాలయ పరిస్థితిని తెలుపుతోంది. ఆర్జీయూకేటీ విద్యాలయ (RGUKT College) నిర్వహణకు ప్రతినెలా రూ.6 కోట్ల నిధులు అవసరం. ఇందులో ఉద్యోగుల వేతనాలకే రూ.2 కోట్లు కావాలి. విద్యుత్తు బిల్లు నెలకు సుమారు రూ.30 నుంచి రూ.35 లక్షల మధ్య ఉంటుంది. మిగతా నిధులు విద్యాలయ నిర్వహణ, విద్యార్థులకు సౌకర్యాల కల్పన, తదితర ఖర్చులకు సరిపోతాయి. విద్యాలయం ఏర్పడిన తొలినాళ్లలో అప్పటి ప్రభుత్వం విద్యాలయ నిర్వహణకు భారీగా నిధులు కేటాయించింది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం సైతం విద్యాలయ అవసరాలకు సరిపడా నిధులు కేటాయించారు. మూడేళ్లుగా పరిస్థితి మారిపోయింది. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యాలయానికి క్రమేణా నిధుల కేటాయింపు తగ్గుతూ వస్తోంది. కేటాయించిన నిధుల్లో సైతం కోత విధిస్తున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. ఆర్జీయూకేటీ విద్యాలయాని (RGUKT College)కి సుమారు రూ.40 కోట్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ (Fixed deposit) నిధులున్నాయి. విద్యాలయ భవిష్యత్తు అవసరాల కోసం వాటిని విద్యాలయ అధికారులు ముట్టుకోవడం లేదు. ప్రభుత్వం నుంచి ఏటా వచ్చే నిధులు, విద్యార్థుల నుంచి వచ్చే ఫీజుల ద్వారా విద్యాలయ నిర్వహణ జరుగుతుంది. విద్యార్థులు చెల్లించే ఫీజుల ద్వారా ఏటా విద్యాలయానికి సుమారు రూ.18 కోట్ల నిధులు సమకూరుతాయి. కరోనా కారణంగా విద్యాలయం మూసివేసి ఉండటం, తరగతుల నిర్వహణ లేకపోవటంతో విద్యార్థుల ఫీజులు ఆగిపోయాయి. మరోవైపు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు సైతం సకాలంలో రాక విద్యాలయ నిర్వహణ కష్టతరంగా మారింది. ఆరునెలలుగా ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందటం లేదు. ఈ నెలలో ఇప్పటివరకు వేతనాలు చెల్లించలేదు.
విద్యుత్తు బకాయిలు రూ.1.10 కోట్లు
ఆర్థిక వనరులు నిండుకోవడంతో విద్యాలయంలో పలు రకాల బకాయిలు పెరిగిపోతున్నాయి. దీంతో చెల్లించాల్సిన వాటితో పాటు ఇతరత్రా ఖర్చులకు అధికారులు వెనకాడాల్సివస్తోంది. విద్యాలయ భద్రతను పర్యవేక్షించే సిబ్బంది, హౌస్ కీపింగ్ ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలివ్వలేదు. ఈ క్రమంలో 20 శాతం సిబ్బందితోనే పనులు చేయించుకోవాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. విద్యాలయంలో జూన్ చివరినాటికి విద్యుత్తు బకాయిలు రూ.కోటీ పది లక్షలు ఉన్నాయి. విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని విద్యుత్తుశాఖ నిర్ణయించినా.. విద్యాలయ అధికారుల విజ్ఞప్తితో నిర్ణయాన్ని మార్చుకుంది. ప్రభుత్వం కరుణిస్తేనే విద్యాలయానికి ఇబ్బందికర పరిస్థితులు తప్పుతాయి.
ఇదీ చూడండి: RGUKT: పాలిసెట్ ద్వారా ఆర్‌జీయూకేటీ సీట్ల భర్తీ..