నిర్మల్ జిల్లా ముథోల్ గ్రామపంచాయతీ 4వ వార్డు సభ్యురాలు లక్ష్మిని అపహరించినందుకు ముగ్గురిపై శనివారం రాత్రి కేసు నమోదైంది. సర్పంచ్, ఉపసర్పంచ్‌ను పదవి నుంచి కలెక్టర్ తొలగించడంతో సోమవారం తాత్కాలిక సర్పంచ్ ఎన్నిక జరగనుంది.
డబ్బులిచ్చి..
వార్డు సభ్యులు రెండు గ్రూపులుగా ఇప్పటికే విడిపోయి రహస్య శిబిరాలకెళ్లారు. తాత్కాలిక సర్పంచ్ ఎన్నికకు 8 మంది అవసరం ఉంది. ఇక్కడ 15 మంది మాత్రమే ఉన్నారు. 4వ వార్డు సభ్యురాలైన లక్ష్మిని గ్రామానికి చెందిన ముగ్గురు అపహరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కుటుంబికుల ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ అజయబాబు తెలిపారు. తాత్కాలిక సర్పంచ్ ఎన్నికకు ఒక్క రోజే గడువుంది. వార్డు సభ్యురాలి అపహరణ రాజకీయంగా దూమారం రేపుతోంది. సర్పంచ్ ఎన్నిక ఉత్కంఠగా మారింది.
అపహరించలేదు..
అపహరణపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇది ఇలా ఉండగా ఈరోజు ఉదయం నుంచి ఒక వీడియో వైరల్‌గా మారింది. 4వ వార్డు సభ్యురాలైన లక్ష్మీ తనను ఎవరూ అపహరించలేదని వీడియోలో తెలిపింది. తనకు ఉపసర్పంచ్ పదవి ఇస్తానంటే ఇష్టపూర్వకంగానే వచ్చానని వెల్లడించింది.
ఇదీ చూడండి: వైఎస్ షర్మిలను కలిసిన తెరాస ఎమ్మెల్యే కుమారుడు