Narayanpet Anganwadi Centre : పూర్వ ప్రాథమిక విద్య. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఒకటో తరగతికి ముందు పిల్లలు చదివే చదువు. అంటే.. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అన్నమాట. ఈ దశలో పిల్లలకు ఏబీసీడీలు, వన్ టూ త్రీలు వస్తే చాలనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు. కానీ ప్రీ ప్రైమరీ అంటే చదువుతో పాటు.. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు కూడా ఈ దశ ఎంతో కీలకం. నారాయణపేట జిల్లాలోని అంగన్వాడీ కేంద్రంలో అమలు చేస్తున్న విద్యా విధానం మిగతా అంగన్‌వ్వాడీల కంటే ప్రత్యేకం.
Narayanpet Anganwadi Centre Looks Like Corporate School : ఇక్కడికొచ్చే పిల్లలకు ఆయాలు, అంగన్‌వాడీ టీచర్లు ప్రతిరోజూ ఉదయం సాదరంగా స్వాగతం పలుకుతారు. అనంతరం పిల్లలు తమకు నచ్చిన హావభావాలతో టీచర్లను పలకరిస్తారు. వయసు, విద్యాసామర్థ్యాలను బట్టి పిల్లలను.. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ .. 3తరగతులుగా విభజించారు. విద్యార్ధులకు చదువంటే ఆసక్తి కలిగేలా అందమైన రంగురంగుల బొమ్మలతో అంగన్వాడీ కేంద్రాన్ని(Anganwadi Children's Centre) ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఆటపాటలతో విద్య నేర్పేందుకు అవసరమైన బొమ్మలు, ఆటవస్తువులు, బోధన పరికరాలు, పుస్తకాల్ని ఉచితంగా సమకూర్చారు.
School Bags : మీ పిల్లల స్కూల్ బ్యాగ్ బరువెంతో తెలుసా?.. నో స్కూల్ బ్యాగ్ డే అమలేది?
Modern Anganwadi Centre Narayanpet : పిల్లల శారీరక ఎదుగుదల కోసం అల్పాహరం, మధ్యాహ్న భోజనంగా పౌష్టికాహారాన్ని అందిస్తారు. భోజనానంతరం గంటపాటు పిల్లలు అక్కడే నిద్రపోతారు. పిల్లల కండరాల ఎదుగుదల కోసం ప్రత్యేక వ్యాయామాలు చేయిస్తారు. మానసిక, శారీరక ఉల్లాసం కోసం ఆటలాడిస్తారు. క్రమశిక్షణ, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. వరుసలో నిలబడటం, ఒకరి తర్వాత ఒకరు వెళ్లడం, చెప్పులు వరుసలో పెట్టడం, పెద్దలను గౌరవించడం లాంటి క్రమశిక్షణలు పిల్లలకు తెలియకుండానే అలవరుస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పిల్లలు ఈ కేంద్రంలో ఉత్సాహంగా గడుపుతారు.
వేలు ఖర్చు చేసి పిల్లల్ని చేర్పించే ప్రైవేటు ప్లే స్కూళ్ల కంటే.. నారాయణపేట ఆధునిక అంగన్‌వాడీ ఎంతో మేలని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. డబ్బుపోసినా ప్రైవేటులో పిల్లలకు చదువు, క్రమశిక్షణ, మంచిఅలవాట్లు అబ్బుతాయన్న హామీలేదని, ఆధునిక అంగన్వాడీలో చేర్చిన తర్వాత పిల్లల్లో మంచి మార్పును గమనిస్తున్నామంటున్నారు. అనువైన చోట జిల్లా వ్యాప్తంగా ఇలాంటి అంగన్వాడీలే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
జిల్లా కలెక్టర్ చొరవతో మొదలై.. ఆధునిక అంగన్‌వాడీ కేంద్రం.. జిల్లా కలెక్టర్ శ్రీహర్ష ఆలోచనతో 2నెలల కిందట ఏర్పాటైంది. పట్టణాల్లో ఒక్కో అంగన్‌వాడీ కేంద్రంలో 20 నుంచి 30 మంది పిల్లలుంటారు. వారి విద్యాసామర్థ్యాలను బట్టి అన్నీనేర్పడం ఒక్క టీచర్ వల్ల కాదు. అందుకే నారాయణపేట పట్టణంలోని 6 కేంద్రాలను (Anganwadi Child Scheme) ఒక్కచోటకు చేర్చి 100మంది విద్యార్ధులతో ఆధునిక అంగన్వాడీని ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాల్లోని టీచర్లకు పూర్వ ప్రాథమిక విద్యపై ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. 6 కేంద్రాల పిల్లలు ఒకేచోటకు రావాలంటే తల్లిదండ్రులకు దూరభారం అవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు త్వరలో బస్సు సౌకర్యాన్ని సైతం ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రయత్నం విజయవంతమైతే 2నుంచి 4వేల జనాభా ఉన్న గ్రామాల్లో ఇలాంటి కేంద్రాలనే ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు.
Anganwadi Centers Problems in Nagarkurnool : సమస్యలకు నిలయాలుగా అంగన్‌వాడీ కేంద్రాలు
నూతన విద్యా విధానానికి మూడేళ్లు.. స్కూల్‌ను సందర్శించిన ప్రధాని... చిన్నారులతో సరదా సంభాషణ