ఆరేళ్ల లోపు చిన్నారులకు సరైన టీకాలు - పౌష్టికాహారం అందించడంతో పాటు అక్షరాలు, ఆటపాటలు నేర్పించేందుకు అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గర్భిణీలకు అవసరమైన ఆహారాన్ని అందించేలా చర్యలు చేపట్టారు. అయితే చాలాచోట్ల కనీస సౌకర్యాలు లేక చిన్నారులతో పాటు గర్బిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ నారాయణపేటలోని బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రం అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది.
అనుకున్నదే తడవుగా: గతంలో నారాయణపేట కలెక్టర్‌గా పనిచేసిన హరిచందన.. ఒకసారి బీసీ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి సమస్యల గురించి చిన్నారులతో పాటు గర్భిణులు ఏకరవు పెట్టారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన హరిచందన.. తక్కువ స్థలంలో అందరినీ ఆకట్టుకునేలా కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా.. చెన్నై నుంచి కంటైనర్ తరహా భవనాన్ని తెప్పించారు.
గర్భిణీల కోసం ప్రత్యేకంగా భోజనశాల: అందులో మూడు గదులు, మరుగుదొడ్డి, రెండు వాష్ బేసిన్లు ఏర్పాటు చేయించారు. వేసవిలో ఉక్కపోతతో ఇబ్బంది కలగకుండా.. ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. చిన్నారులను ఆకట్టుకునే విధంగా గోడలపై బొమ్మలు, అక్షరాలు అలంకరించారు. ఈ అంగన్‌వాడీ కేంద్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు రూ.11 లక్షలు వెచ్చించారు. చిన్నారులకే కాకుండా ఇక్కడ గర్భిణీల కోసం ప్రత్యేకంగా భోజనశాల ఏర్పాటు చేశారు.
వాటితో పాటు కేంద్రం అవరణలో టమాట, వంకాయ, తీగజాతి కూరగాయలు సాగుచేస్తున్నారు. త్వరలోనే ఈ అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రైవేట్ ప్లేసూల్స్‌ను తలదన్నేలా రాష్ట్రానికే ఆదర్శవంతంగా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దారంటూ స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
"తక్కువ ఖర్చులో ఎలా నిర్మించాలనే ఉద్దేశంతో మాడ్యూలర్ ఇల్లు తయారు చేయించారు. ఆధునిక హంగులతో అన్ని ఏర్పాట్లతో అంగన్‌వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ఈ కేంద్రానికి కావాల్సిన ఆట వస్తువులనుు ఓ ఎన్జీఓ సమకూర్చింది." - వేణుగోపాల్ రావు, నారాయణపేట సంక్షేమ అధికారి
ఇవీ చదవండి: నేడు జరగాల్సిన GRMB సమావేశం వాయిదా..
నగలు తాకట్టుపెట్టి ఊరికి ఉపకారం.. సొంతంగా వంతెన, రోడ్డు నిర్మించిన తండ్రీకొడుకులు