మొన్నటివరకు వర్షాభావ పరిస్థితులతో రైతులు కొట్టుమిట్టాడుతూ వ్యవసాయ సాగుకు సన్నద్ధం కాలేక ఇబ్బందులు పడ్డారు. అయితే కృష్ణా ఎగువ రాష్ట్రాల్లో భారీగా కురిసిన వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటం వల్ల ఎగువన ఉన్న జలాశయాలు నిండాయి. ఇప్పుడిప్పుడే నాగార్జున సాగర్‌కు వరద మొదలైంది. దీనితో ప్రాజెక్టు ఎడమ కాలువ ఆయకట్టు రైతాంగంలో సంతోషం నెలకొంది. సాగర్ ఎడమ కాలువ వస్తదని రైతులు ఆశాభావంతో ఉన్నారు. ఇరిగేషన్ అధికారులు త్వరలో నీరు విడుదలకు ప్రణాళికలు తయారు చేయాలని రైతులు కోరుతున్నారు. సకాలంలో నీరు విడుదల చేయడం వల్ల వరి నారుమళ్లు పెంచుకోవడానికి అవకాశం ఉందంటున్నారు.
వర్షాలు లేనప్పుడు బోర్లు, బావులు ఆధారంగా సాగుచేయడం కష్టంగా ఉండేదని రైతులు తెలిపారు. బోరుబావులతో గంట, రెండు గంటల కన్నా ఎక్కువ నీరు పొలాలకు చేరేది కాదని పేర్కొన్నారు. భూగర్భ జలాలు లేక బోర్లు, బావులు తీయించి అలసిపోయామన్నారు. ఆగస్టులోనే నాగార్జున సాగర్ నిండేదని.. కృష్ణమ్మ వరద ప్రబావంతో ఈ సారి రెండు పంటలకు సాగునీరు అందుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. సాగర్ ఎడమ కాలువ వస్తే తమ కష్టాలన్నీ తీరుతాయని రైతులు తెలిపారు.
ఇవీ చూడండి : పొలం పనులకు వెళ్లి వాగులో చిక్కుకున్నారు