ఓటు మన చేతిలోని ఆయుధం అని, మనిషి తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఓటుహక్కును వినియోగించుకోవాలని తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరాం అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఎన్‌ఎస్‌పీ క్యాంప్ గ్రౌండ్‌లో ఉదయపు నడకలో పాల్గొన్న వారితో ఆయన మాట్లాడారు. పట్టభద్రుల ఓట్ల నమోదుపై అవగాహన కల్పించారు. ఓటు నమోదు ప్రక్రియ నవంబర్ 6న ముగుస్తుందని, అందరూ ఈ ఆరు రోజులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ఓటుహక్కు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఎల్‌ఆర్‌ఎస్‌పై అందరికీ అసంతృప్తి ఉందని, ఉద్యోగులకు పే రివిజన్ కమిషన్ ఇంకా అమలు కాలేదని విమర్శించారు.
ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న వారికి ఆరు నెలలుగా జీతాలు రావడం లేదని, దీనావస్థలో ఉన్న వారికి జీవో 45 అమలు చేసి ఆదాయ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని, 1,50,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణలో బతుకుదెరువు- ఆత్మగౌరవం సమస్యలు మళ్లీ మొదలయ్యాయని అన్నారు. తెలియకుండానే కొంతమంది మన డిగ్రీ ధ్రువపత్రాలతో వేరొకరి పేరు మీద ఓటు నమోదు చేసే ప్రమాదం ఉందని, ఎట్టి పరిస్థితిలో దొంగ ఓట్లను ప్రోత్సహించవద్దని సూచించారు.
ఇదీ చదవండి: అన్నదాతలను అవస్థలకు గురిచేస్తున్న సన్నరకం సాగు