నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం ముందు నాగార్జున సాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులు ఆందోళన నిర్వహించారు. తమ భూములు కబ్జా చేశారంటూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. సాగర్ ప్రాజెక్టు పరిధిలో భూములు, ఇళ్లు కోల్పోగా తమకు ప్రభుత్వం వజీరాబాద్ ప్రాంతంలో ఇచ్చిన భూములను ఇతరులు కబ్జా చేశారంటూ బాధితులు ఆరోపించారు.
జిల్లాలోని పెద్దఅడిశర్లపల్లి మండలం పెద్ద గుమ్మడం గ్రామం 1971లో ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురైంది. 44 కుటుంబాల వారు నిర్వాసితులు కాగా, అప్పటి ప్రభుత్వం దామచర్ల మండలం వజీరాబాద్ పరిధిలో భూములు కేటాయించింది. 430 సర్వే నెంబర్లో 44 కుటుంబాలకు ఐదు ఎకరాల చొప్పున భూమి, 22 ఎకరాలలో ఇళ్ల స్థలాలను కేటాయించారు. అప్పట్లో సాగుకు అనుకూలంగా లేకపోగా నిర్వాసితులు ఇక్కడ కొంత కాలం ఉండి ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇదే అదనుగా భావించి 12 మంది అక్రమంగా రెవెన్యూ సిబ్బంది సహకారంతో వాచ్యతండ పరిధిలోని భూములను ఆక్రమించడంతో పాటు, ఇళ్ల స్థలాలను సైతం కబ్జా చేశారు.
ఆక్రమణలపై 2019 మే 24న వాడపల్లి పోలీస్ స్టేషన్లో 44 మందిపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు. ఏళ్ల తరబడి తాము ఆందోళన చేస్తున్న న్యాయం జరగడం లేదన్నారు. ఇకనైనా అక్రమార్కులపై చర్యలు తీసుకుని ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి.
ఇవీ చదవండి: పసరు పేరుతో మోసాలు చేస్తున్న ముఠా అరెస్టు