నల్గొండ జిల్లాలో నిన్న సాయంత్రం ఈదురు గాలులతో కూడిన అకాలవర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా నల్గొండ మండలంలోని రాములబండా, పాలిపార్ల గూడెం,తోరగల్లు,కాకుల కొండారం,దుప్పలపల్లి,అప్పాజీపేటతోపాటు పలు గ్రామాల్లో భారీ స్థాయిలోనే ఆస్తినష్టం జరిగింది.
వర్షం ఓ మోస్తరుగా కురిసినప్పటికీ... ఈదురు గాలిబాగా వీయడం వల్ల పలువురి ఇంటిపై కప్పులు ఎగిరిపోగా... గోడలు కూలీపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోవడం వల్ల రాత్రి కరెంట్ లేక ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
ఒక్క రాములబండా గ్రామంలొనే దాదాపుగా 10 ఇళ్లకు ఏదో ఒకటి కూలినట్లు అధికారులు తెలిపారు. అదే గ్రామంలో రైస్ మిల్లు కూడా నెలమట్టమైంది. సుమారుగా 12 లక్షల రూపాయల నష్టం జరిగిందని... ప్రభుత్వమే ఆదుకోవాలని మిల్లు యజమాని వేడుకున్నాడు.
ఆరు గ్రామాలలో దాదాపుగా 50 ఇళ్ల వరకు నేలమట్టమైనట్లు తహసీల్దార్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితోపాటు ,ప్రభుత్వ అధికారులు ఆయా గ్రామాలను సందర్శించి తగిన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.