నల్గొండ జిల్లా చండూరులో నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని 56 రోజులుగా చేనేత కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షకు తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌రమణ సంఘీభావం ప్రకటించారు. కరోనా సమయంలో నేత కార్మికులు చేస్తున్న దీక్షలు న్యాయమైనవని రమణ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వెంటనే వారి సమస్యలు పరిష్కరించి ఉపాధి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
సుమారు లక్ష కుటుంబాలు..
రాష్ట్రంలో దాదాపుగా లక్ష చేనేత కుటుంబాలున్నాయని రమణ గుర్తు చేశారు. వారందరికీ ప్రత్యక్షంగా గాని పరోక్షంగా కానీ పని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం..
లేని పక్షంలో పద్మశాలీలంతా ప్రగతి భవన్‌ను ముట్టడి చేస్తామని హెచ్చరించారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించి ఆత్మహత్యలు చేసుకోకుండా చూడాలని కోరారు.
మృతదేహం ప్రగతి భవన్ ముందే..
రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం కారణంగా చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడితే అదే మృతదేహాన్ని ప్రగతి భవన్ ముందు ఉంచుతామని పేర్కొన్నారు. చేనేత సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఇకనైనా ప్రభుత్వం నిద్రావస్థలో నుంచి మేల్కోవాలని హితవు పలికారు.
ఇవీ చూడండి : రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు అక్కడక్కడా వర్షాలు