కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆలస్యంగానైనా పాఠశాల విద్యార్థులకు డిజిటల్ తరగతులు ప్రారంభం అవుతున్నాయి. మంగళవారం నుంచి టెలివిజన్, ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా విద్యార్థులు పాఠాలు వినాల్సి ఉంటుంది. 3 నుంచి 10వ తరగతులకు ప్రారంభించనున్న విద్యాబోధన పర్యవేక్షణ, విద్యార్థులు సద్వినియోగం కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరవుతున్నారు.
విద్యార్థులు బడికి రాకుండానే టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, కంప్యూటర్‌లలో తరగతులు వినేలా ప్రణాళిక సిద్ధం చేసిన ప్రభుత్వం అమలుకు శ్రీకారం చుట్టింది. కరోనా సంకటం వేళ ప్రభుత్వ విద్యార్థులకు టీవీ పాఠం దగ్గర కానుంది. అయిదు నెలలుగా ఆట పాటలతో గడిపిన విద్యార్థులను చదువు వైపు మళ్లించుటలో తల్లిదండ్రుల పాత్ర ఎక్కువగా ఉండాలి. ఆ దిశగా ఉపాధ్యాయులు కసరత్తు మొదలు పెట్టారు. విద్యార్థుల అవసరాల దృష్ట్యా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు దూరదర్శన్ యాదగిరి, టీ శాట్ ఛానల్ ప్రసారాలను మెరుగుపర్చారు. అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు.
2.16 లక్షల మంది విద్యార్థులు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 నుంచి 10వ తరగతి vవరకు 2.16 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. నల్గొండ జిల్లాలో 77,104 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో టీవీలు, మొబైల్‌ఫోన్లు, కంప్యూటర్‌లు, డిజిటల్ తరగతులకు ఎలాంటి ఉపకరణాలు లేని విద్యార్థులు 3454 మంది ఉన్నారు. మారుమూల ప్రాంతాలు, నిరుపేదలైన ఆయా విద్యార్థులకు కూడా డిజిటల్ తరగతులు అందించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి ఉపకరణాలు లేని విద్యార్థులు దగ్గరలోని స్నేహితుల ఇళ్లకు వెళ్లి వినడాన్ని ప్రోత్సహించడం, సంబంధిత గ్రామాల ప్రజాప్రతినిధులతో మాట్లాడి విద్యార్థులకు బోధన అందేలా చర్యలు తీసుకునేలా చూస్తున్నారు.
డిజిటల్ తరగతులపై శ్రద్ధ
విద్యార్థులు డిజిటల్ తరగతులను సద్వినియోగం చేసుకోవడంపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దీనిపై ఉపాధ్యాయులు, స్థానిక అధికారులు పర్యవేక్షణ చేయడం, విద్యార్థులను ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఎంత మంది విద్యార్థులు డిజిటల్ తరగతులు విన్నారనే విషయాలను గూగుల్ షీట్స్‌లలో ప్రధానోపాధ్యాయుల ద్వారా జిల్లా అధికారులు తెప్పించుకోనున్నారు. విద్యార్థులు ఏ రూపంలో డిజిటల్ పాఠాలు వింటున్నారనే విషయాలపై సంబంధిత ఉపాధ్యాయుల ద్వారా ఫొటోలు సేకరించనున్నారు.
తల్లిదండ్రుల పాత్రే కీలకం
గ్రామీణ ప్రాంతాల్లో పొలం పనులకు వెళ్లే తల్లిదండ్రులు విద్యార్థి విద్యాభ్యాసానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలి. టీవీ/చరవాణి/కంప్యూటర్ అందుబాటులో ఉంచాలి. రోజువారీ డిజిటల్ తరగతుల అనంతరం తలెత్తే అనుమానాలపై సంబంధిత విషయ ఉపాధ్యాయుడితో చరవాణిలో మాట్లాడించాలి. పిల్లలు పాఠ్యాంశాలు వింటున్నారా అనేది గమనించాలి.
డిజిటల్ పాఠాలు ప్రసారమయ్యే డీటీహెచ్ ఛానళ్ల వివరాలు
డిష్‌టీవీ 1,627, ఎయిర్‌టెల్ 946, సన్‌డైరెక్ట్ 188, హాత్‌వే 719, వీడియోకాన్ 702, టాటా స్కై 1499.
టీశాట్ ప్రసారాలు అందుబాటులో ఉండే యాప్‌లు
టీశాట్ యాప్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్, జియోటీవీ యాప్.
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
-బి.భిక్షపతి, డీఈవో, నల్గొండ
డిజిటల్ తరగతులను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలి. టీశాట్, దూరదర్శన్, యూట్యూబ్ ద్వారా పాఠాలు వినేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ప్రతి విద్యార్థి వారి తరగతికి సంబంధించిన సమయంలో సంబంధిత ఉపకరణాలను వినియోగించి పాఠాలు వినాలి. ఈనెల 27 నుంచి పాఠశాలలకు ఉపాధ్యాయులు వస్తున్నందున వారు కూడా వీడియో పాఠాలు తయారుచేసి స్మార్ట్‌ఫోన్‌లు ఉన్న వారికి పంపిస్తారు.
96 శాతం మందికి సౌకర్యాలు
-చైతన్యజైని, డీఈవో, యాదాద్రి
డిజిటల్ తరగతులకు ఏర్పాట్లు పూర్తి చేశామని యాదాద్రి జిల్లా విద్యాశాఖాధికారిని చైతన్య జైని తెలిపారు. ఇందుకు టీశాట్, దూరదర్శన్ యాదగిరి ఛానల్స్ ద్వారా తరగతులు నిర్వహిస్తామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 96 శాతం విద్యార్థుల వద్ద సెల్‌ఫోన్, టీవీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సౌకర్యం లేని నాలుగు శాతం విద్యార్థులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. డిజిటల్ పాఠాలు వీక్షించే సమయంలో తల్లిదండ్రులు పర్యవేక్షించాలని తెలిపారు.
విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం
-గుండా కృష్ణమూర్తి, ప్రధానోపాధ్యాయుడు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, హాలియా
ఆన్‌లైన్ తరగతుల గురించి విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. టీవీ, చరవాణి వాటికి ఇంటర్‌నెట్ అవకాశం ఎంతమందికి ఉంది.. లేనిది సేకరించాం. లేని వారికి అవకాశం కల్పించుటకు గ్రామ సర్పంచి సహకారం తీసుకుంటున్నాం. సందేహాల నివృత్తికి పాఠశాల విద్యార్థులందరి చరవాణి నెంబర్లతో వాట్సాప్ సమూహం ఏర్పాటు చేశాం. తల్లిదండ్రుల సహకారం చాలా ముఖ్యం. పిల్లలు చరవాణి వినియోగంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి.
అందుబాటులో టీ శాట్ ఛానళ్లు
- అలుగుబెల్లి భాస్కర్‌రెడ్డి, కేబుల్ టీవీ ఎంఎస్‌వో, దేవరకొండ
విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతుల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేబుల్ టీవీ ఆపరేటర్లు టీ శాట్ ఛానళ్లను అందుబాటులోకి తెచ్చారు. కేబుల్ ప్రసారాలు కొనసాగుతున్న మారుమూల పల్లెల్లోని గృహాలకు సైతం ‘టీ శాట్ విద్య, టీ శాట్ నిపుణ, డీడీ యాదగిరి’ ఛానళ్ల ప్రసారాలు కొనసాగుతున్నాయి. అంతర్జాలంతో అవసరం లేకుండా విద్యార్థులు కేబుల్ టీవీ ద్వారా తరగతులు వీక్షించవచ్ఛు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంలో కేబుల్ ఆపరేటర్లు ముందుంటారు.
ఇవీ చూడండి: విద్యార్థులకు ఫోన్లు చేసి సందేహాలు తీర్చండి: మంత్రి సత్యవతి